మమతా బెనర్జీకి ఈసీ నోటీసులు!

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.

Updated : 08 Apr 2021 02:31 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దీదీ చేసిన వ్యాఖ్యలపై 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. మత ప్రాతిపదికన ఓట్లు అడగడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రావడంతో దీనిపై 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 3వ తేదీన హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌ ప్రాంతంలో మమతా బెనర్జీ పర్యటించారు. ఆ సమయంలో ఓ వర్గాన్ని ప్రస్తావించిన దీదీ.. కొన్ని పార్టీలు మైనారిటీ ఓటర్లను విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి సమయంలో మైనారిటీ ఓటర్లందరూ ఏకం కావాలని మమత  పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీనిపై కేంద్రమంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నఖ్వీ నేతృత్వంలోని భాజపా బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. 48గంటల్లో వివరణ ఇవ్వాలని మమతా బెనర్జీకి నోటీసులు జారీచేసింది.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. పోలింగ్‌ సమయంలోనూ భాజపా, తృణమూల్‌ కార్యకర్తలను మధ్య ఘర్షణలు జరిగాయి. తాజాగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌ కాన్వాయ్‌పై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దిలీప్‌ ఘోష్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని