IT Rules: కొత్త నిబంధనలపై స్పందించిన ఫేస్‌బుక్‌!

డిజిటల్‌ కంటెంట్‌ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నిబంధనలు అమలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వెల్లడించింది.

Published : 25 May 2021 23:05 IST

మే 26 నుంచి కొత్త నిబంధనలు

దిల్లీ: డిజిటల్‌ కంటెంట్‌ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నిబంధనలు అమలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వెల్లడించింది. అయితే, వీటిలో నెలకొన్న కొన్ని సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. డిజిటల్‌ కంటెంట్‌ విషయంలో నైతిక విలువల నియమావళి, ఫిర్యాదుల పరిష్కారం కోసం మూడంచెల వ్యవస్థల ఏర్పాటుపై విధించిన డెడ్‌లైన్‌ నేటితో ముగుస్తుండడంతో ఫేస్‌బుక్‌ ఇలా స్పందించింది.

‘ఐటీ నిబంధనల్లోని అంశాలను పాటించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కానీ, ఇందులో ఉన్న కొన్ని సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో మరిన్ని సంప్రదింపులు కొనసాగిస్తాం’ అని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఐటీ నిబంధనలకు అనుగుణంగా తమ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడంతో పాటు ఇందుకు కావాల్సిన కార్యాచరణ ప్రక్రియను మొదలు పెట్టామన్నారు. అంతేకాకుండా ఈ వేదికపై ప్రజలు స్వేచ్ఛగా వారి భావాలను వ్యక్తీకరించేందుకు ఫేస్‌బుక్‌ కట్టుబడి ఉందని సంస్థ ప్రతినిధి స్పష్టంచేశారు.

కేంద్రం నిర్ణయంపై ఆసక్తి..

డిజిటల్‌ కంటెంట్‌ నియంత్రణ కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే వీటికి కట్టుబడుతూ సామాజిక మాధ్యమ సంస్థలు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు చివరి రోజు చర్యలు చేపట్టలేదు. ఇలా నిబంధనలకు కట్టుబడకుంటే ఈ సంస్థలకున్న మధ్యవర్తి హోదా (ఇంటర్మీడియరీ స్టేటస్‌) రద్దవుతుందని, క్రిమినల్‌ చర్యలనూ ఎదుర్కోవాల్సి రావొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో వాటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక వార్తా సైట్లు, ఓటీటీలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. దీని ప్రకారం, నిబంధనలను అమలు చేయడానికి ఆయా సంస్థలు భారత్‌లో అధికారులను నియమించుకోవడం, వారి పేరు, చిరునామాలను వెల్లడించడం, నెటిజన్ల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం, అభ్యతంరకర కంటెంట్‌పై పర్యవేక్షణ, వాటి తొలగింపు వంటివి ఆయా సంస్థలు చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన నిబంధనలకు కట్టుబడడానికి మూడు నెలల గడువును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అది నేటితో (మే 25తో) ముగిసింది. ఇప్పటివరకు ‘కూ’ సంస్థ మినహా ఏ కంపెనీ కూడా భారత్‌లో ప్రత్యేక అధికారులను నియమించలేదు. అమెరికాలో తమ ప్రధాన కార్యాలయాల నుంచి సూచనల కోసం ఎదురుచూస్తున్నామని, అందువల్ల 6నెలల గడువు ఇవ్వాలని సంస్థలు కోరుతున్నాయి. తాజాగా స్పందించిన ఫేస్‌బుక్‌, ఐటీ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తామని.. అదే సమయంలో పలు సమస్యలపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని