ISRO: దోశ.. ఫిల్టర్ కాఫీ: ఇస్రో విజయ మంత్రాలట..!

చంద్రయాన్-3(Chandrayaan-3), ఆదిత్య-ఎల్‌1(Aditya-L1).. ఇలా వరుస ప్రాజెక్టులతో ఇస్రో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. ఒక ప్రయోగం తర్వాత మరో ప్రయోగం బాధ్యతలు చూస్తున్న వారిని మోటివేట్ చేసే అంశాలేంటో తెలిస్తే ఆశ్చర్యం కలగమానదు. 

Published : 02 Sep 2023 16:51 IST

దిల్లీ: చంద్రయాన్‌-3(Chandrayaan-3) విజయాన్ని ఆస్వాదిస్తున్న భారతీయులకు భారత అంతరిక్ష సంస్థ(ISRO) 10 రోజుల వ్యవధిలో మరో ట్రీట్ ఇచ్చింది. శనివారం సూర్యుడి సమీపంలో పరిశోధనలకు తొలి సోలార్‌ మిషన్ ఆదిత్య-ఎల్‌1(Aditya-L1)ను విజయవంతంగా లాంచ్‌ చేసింది. ఇంతటి చరిత్రాత్మక విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న మన శాస్త్రవేత్తలు చప్పట్లతోనే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అంతేతప్ప ఆ హడావుడి బయట ఎక్కడా కనిపించదు. తమ పనిగంటలు ముగిసిన తర్వాత కూడా అదనపు సమయాన్ని ప్రాజెక్టు పూర్తి చేయడానికే కేటాయిస్తుంటారు.

అలాంటిది.. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతోన్న వీరిని ఇంతగా మోటివేట్ చేస్తున్న అంశం ఏమిటి..? ఈ ప్రశ్న ఎవరికైనా రాక మానదు. సమాధానం వింటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే..! ప్రతి సాయంత్రం రుచి చూసే.. మసాలా దోశ, ఫిల్టర్‌ కాఫీ వారి విజయ మంత్రాలట. జాబిల్లి మిషన్ విజయం సాధించినందుకు శాస్త్రవేత్తలకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఏమీ లేవట. మిషన్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. ‘ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటలకు మేం భుజించే మసాలా దోశ, ఫిల్టర్ కాఫీతోనే ఈ విజయం సాధించాం. ఇప్పుడు అకస్మాత్తుగా వీటి మీద అందరికి ఆసక్తి పెరిగింది’ అని శర్మ వెల్లడించారు. ఆయన ఇస్రో(ISRO) ఉద్యోగినినే వివాహమాడారని ఆ కథనం పేర్కొంది. 

జాబిల్లి ఉపరితలంపై.. ‘సెంచరీ’ కొట్టిన రోవర్‌!

ఇదివరకు ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ మాట్లాడుతూ.. తమ శాస్త్రవేత్తలు సాధారణ జీవితాన్నే గడుపుతారని అన్నారు. ‘వారెప్పుడు డబ్బును పట్టించుకోరు. ఏకాగ్రత మొత్తం మిషన్‌పైనే ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని నిపుణుల జీతాల్లో ఐదో వంతు మాత్రమే తీసుకునే మన(ISRO) శాస్త్రవేత్తలు.. ఈ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని