బాంబు తయారీకి ఆన్‌లైన్‌లో కెమికల్స్‌ కొని...

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పుల్వామా దాడి ఘటనకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులను ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) అరెస్టు చేసింది. వీరిలో ఒకరు పేలుడు పదార్థాలకు కావాల్సిన

Updated : 07 Mar 2020 10:33 IST

శ్రీనగర్‌: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పుల్వామా దాడి ఘటనకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులను ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) అరెస్టు చేసింది. వీరిలో ఒకరు పేలుడు పదార్థాలకు కావాల్సిన వస్తువులను సమకూర్చిన వ్యక్తి కావడం గమనార్హం. శ్రీనగర్‌కు చెందిన వాజీ-ఉల్-ఇస్లామ్‌(19)తో పాటు మహ్మద్‌ అబ్బాస్‌ రాథర్‌(32)ను పుల్వామా జిల్లా హక్రీపోరా గ్రామంలో అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. ఇప్పటివరకూ ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. తారిక్‌ అహ్మద్‌ షా అనే ట్రక్‌ డ్రైవర్, అతని కుమార్తె ఇన్షా జాన్‌లు ఉగ్రవాదులైన ఆదిల్‌ అహ్మద్‌ దార్‌, మహ్మద్‌ ఉమర్‌ ఫరూఖ్‌, కమ్రాన్‌, సమీర్‌ అహ్మద్‌ దార్‌, ఇస్మాయిల్‌లకు ఆశ్రయం కల్పించడంతో పాటు కుట్రకు సహకరించారని దర్యాప్తులో తేలడంతో ఇటీవల వీరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

ఆన్‌లైన్‌లో కెమికల్స్‌ కొని..

తాజాగా అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులను విచారించిన  ఎన్‌ఐఏ అధికారులు వీరి సమాధానాలు విని ఆశ్చర్యపోయారు. పేలుడు పదార్థాల తయారీకి కావాల్సిన కెమికల్స్‌ను ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైలర్‌ నుంచి కొనుగోలు చేసినట్లు ఇస్లామ్‌ తెలిపాడు. బ్యాటరీలు, ఇతర పరికరాలను పాకిస్థాన్‌ జైష్‌-ఎ-మహ్మద్‌ ఉగ్రవాదుల మార్గ నిర్దేశంతో కొన్నట్లు వెల్లడించాడు. అంతేకాదు, తానే స్వయంగా ఉగ్రవాదులకు వాటిని అందజేసినట్లు అంగీకరించాడు. ‘రాథర్‌ జైషేకు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాడు. జైషే ఉగ్రవాది, ఐఈడీ తయారీలో నిపుణుడైన ఉమర్‌కు 2018 ఏప్రిల్‌-మే నెలల్లో తన ఇంట్లో ఆశ్రయమిచ్చాడు. ఇతనితో పాటు ఆత్మాహుతి సభ్యులైన అహ్మద్‌ దార్‌, సమీర్‌ అహ్మద్ దార్‌, కమ్రాన్‌లతో పాటు ఒక పాక్‌ జాతీయుడికి పలు మార్లు తన ఇంట్లో ఉండేందుకు అవకాశం కల్పించాడు. రాథర్‌ ఇంట్లో నుంచే వీరంతా పుల్వామా దాడి రచన చేశారు’ అని అధికారులు తెలిపారు. 

2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపొరా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అమరులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని