
ఆపరేషన్ సముద్ర సేతు: కొచ్చి చేరుకున్న తొలి నౌక!
కొచ్చి: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సముద్రమార్గం ద్వారా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం ‘ఆపరేషన్ సముద్ర సేతు’ ఆరంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మాల్దీవుల నుంచి బయలుదేరిన ఐఎన్ఎస్ జలాశ్వ యుద్ధనౌక భారత్ చేరుకుంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత్ చేరుకున్న తొలి నౌక ఇదే. మాల్దీవుల్లో చిక్కుకున్న 698మంది భారతీయులతో బయలుదేరిన జలాశ్వ ఆదివారం ఉదయం కొచ్చి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 440మంది కేరళకు చెందిన వారు కాగా మిగతావారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారని కేరళ ఐజీ విజయ్ సఖరే వెల్లడించారు. వీరిలో 187మంది తమిళనాడు, 9మంది తెలంగాణకు చెందగా మరో 8మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. మరో 8మంది కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారుకాగా హరియాణా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారు ముగ్గురు చొప్పున ఉన్నారు. వీరందరి వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు.
ఆపరేషన్ సముద్ర సేతులో భాగంగా ఐఎన్ఎస్ జలాశ్వతోపాటు ఐఎన్ఎస్ మాగర్ యుద్ధనౌకలు గురువారం మాల్దీవులకు చేరుకున్నాయి. అక్కడ చిక్కుకున్న భారతీయులకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని నౌకలోకి ఎక్కించారు. వీటిలో ఇప్పటికే ఐఎన్ఎస్ జలాశ్వ కొచ్చి చేరుకోగా మరో నౌక ఐఎన్ఎస్ మాగర్ కూడా ఈరోజు తమిళనాడుకు చేరుకునే అవకాశం ఉంది.
ఇవీ చదవండి..
భారత్‌లో 2వేలు దాటిన కరోనా మరణాలు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.