LJP: ఎల్‌జేపీ నేతగా చిన్నాన్నను గుర్తించొద్దు

లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) సభాపక్ష నాయకునిగా తన చిన్నాన్న పశుపతి కుమార్‌ పారస్‌ను గుర్తించడంపై

Published : 17 Jun 2021 10:32 IST

లోక్‌సభ స్పీకర్‌కు చిరాగ్‌ లేఖ 

దిల్లీ: లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) సభాపక్ష నాయకునిగా తన చిన్నాన్న పశుపతి కుమార్‌ పారస్‌ను గుర్తించడంపై ఆ పార్టీ నాయకుడు చిరాగ్‌ పాసవాన్‌ అభ్యంతరం తెలిపారు. ఇది తమ పార్టీ నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంటూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. తమ పార్టీ రాజ్యాంగంలోని 26వ అధికరణం ప్రకారం లోక్‌సభలో పార్టీ నాయకునిగా ఎవరు ఉండాలనే విషయాన్ని సెంట్రల్‌ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు. పశుపతి పారస్‌ విషయంలో దాన్ని పాటించలేదని, అందువల్ల ఆయనను నాయకునిగా గుర్తించడం సరికాదని తెలిపారు. అయిదుగురు ఎంపీలను కూడా పార్టీ నుంచి బహిష్కరించినట్టు చెప్పారు. అందువల్ల నిర్ణయాన్ని సమీక్షించాలని కోరారు. బుధవారం తొలిసారిగా ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ పరిస్థితికి జేడీ(యూ)యే కారణమని ఆరోపించారు. తన తండ్రి రాంవిలాస్‌ పాసవాన్‌ బతికి ఉన్నప్పుడే ఇలాంటి కుట్రలు జరిగాయని చెప్పారు. తాను సింహం బిడ్డనని, దీనిపై పోరాడుతానని అన్నారు. తన ఆరోగ్యం బాగులేని సమయంలో కుట్ర జరిగిందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సాయం కోరుతారా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ‘‘అడిగితే హనుమంతుని గొప్పతనం ఏముంది? రాముని గొప్ప ఏముంది?’’ అని వ్యాఖ్యానించారు. ‘‘గత ఏడాది నా తండ్రి చనిపోయినప్పుడు కూడా అనాథనయ్యానన్న భావన రాలేదు. ఇప్పుడు ఆ బాధ కలుగుతోంది’’ అని చెప్పారు. తానెప్పుడూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదని, పార్టీ నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని తెలిపారు. తన మరో చిన్నాన్న కుమారుడు, ఎంపీ ప్రిన్స్‌ రాజ్‌పై ఓ మహిళ చేసిన లైంగిక వేధింపు ఆరోపణలను ప్రస్తావించగా, దీనిపై పోలీసులను ఆశ్రయించాలని గతంలోనే వారికి చెప్పానని అన్నారు.
నేడు అధ్యక్షుని ఎన్నిక: మరోవైపు పశుపతి పారస్‌.. చిరాగ్‌పై విమర్శలు చేస్తూ ఆయనకే పార్టీలో ఎలాంటి పదవీ లేదని అన్నారు. గురువారం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. తమను పార్టీ నుంచి బహిష్కరించే అధికారం ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు