Booster Dose: బూస్టర్‌ డోసుతో కొత్త వేరియంట్లకు అడ్డుకట్ట

కరోనా వ్యాపిస్తున్నకొద్దీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రమాదకరంగా మారుతున్నాయి. టీకా తీసుకున్నవారు కూడా మహమ్మారికి చిక్కుతున్నారు. దీంతో వ్యాక్సిన్ల ద్వారా లభిస్తున్న రోగనిరోధక..

Published : 03 Aug 2021 10:14 IST

 అవయవమార్పిడి చేయించుకున్న వారిలోనూ యాంటీ బాడీల అభివృద్ధి

వర్జీనియా విశ్వవిద్యాలయ అంటు వ్యాధుల నిపుణుడు విలియం పెట్రి

రిచ్‌మండ్‌: కరోనా వ్యాపిస్తున్నకొద్దీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రమాదకరంగా మారుతున్నాయి. టీకా తీసుకున్నవారు కూడా మహమ్మారికి చిక్కుతున్నారు. దీంతో వ్యాక్సిన్ల ద్వారా లభిస్తున్న రోగనిరోధక శక్తితో వైరస్‌ నుంచి రక్షణ పొందలేమా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బూస్టర్‌ డోసు ఆవశ్యకతపై శాస్త్రవేత్తలు కీలక పరిశోధనలు చపట్టారు. బూస్టర్‌ డోసుకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న పలు కీలక ప్రశ్నలకు... యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియాకు చెందిన మైక్రో బయాలజిస్ట్, అంటు వ్యాధుల నిపుణుడు విలియం పెట్రి సమాధానాలిచ్చారు. ఈ డోసు అవసరమా? ఎవరికి, ఎప్పుడు ఇవ్వాలి అనే విషయాలను వివరించారు.

బూస్టర్‌ డోసు అంటే?

మనిషి శరీరంలో రోగ నిరోధకశక్తి క్రమంగా తగ్గుతుంది. ఏ టీకా ద్వారా లభించిన ఇమ్యూనిటీకైనా ఇదే వర్తిస్తుంది. ఈ రోగ నిరోధకశక్తి కొనసాగేందుకు బూస్టర్‌ డోసులు ఉపయోగిస్తారు. రెండు డోసులు తీసుకున్నవారికి అదనంగా ఇచ్చే డోసు ఇది. వైరస్‌ మార్పులకు అనుగుణంగా కొన్నిసార్లు బూస్టర్‌ డోసును మరింత సమర్థంగా తయారు చేస్తారు. కొత్త వేరియంట్లను అడ్డుకునేలా రూపొందిస్తారు.

వ్యాక్సిన్‌ నియంత్రణ సంస్థలు ఏమంటున్నాయి?

అమెరికాలోని వ్యాక్సిన్‌ నియంత్రణ సంస్థలు... బూస్టర్‌ డోసు విషయమై ఇప్పటివరకూ ఎలాంటి సిఫారసులూ చేయలేదు. ఇజ్రాయెల్‌లో మాత్రం 60 ఏళ్లు దాటినవారు మూడో డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఫ్రాన్స్‌లోనూ ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

ఈ డోసుపై ఎందుకు ముందుకు వెళ్లడం లేదు?

కరోనా వ్యాక్సిన్‌ కల్పించే రక్షణ ఎంతకాలం ఉంటుందన్నది నిర్ధారణ కాలేదు. అయితే ప్రస్తుతమున్న కొవిడ్‌ టీకాలన్నీ మంచి ఇమ్యూనిటీనే అందిస్తున్నాయి. ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో 3 నెలల తర్వాత కూడా ‘బీ లింఫోసైట్ల’లో అధిక మెమొరీని గుర్తించారు. ఇది యాంటీబాడీల ఉత్పత్తికి దోహదపడుతుంది. కరోనా వ్యాప్తిని అడ్డుకోలేకపోయినా, వైరస్‌ నుంచి కొన్ని టీకాలు రక్షణ కల్పిస్తున్నట్టు ఇతర అధ్యయనాలు ధ్రువీకరించాయి. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా... బీటా వేరియంట్‌పై 14 రోజుల తర్వాత 73%, 28 రోజుల తర్వాత 82% సమర్థత కనబర్చింది. డెల్టా రకంపై ఫైజర్‌ టీకా 88% సామర్థ్యంతో పనిచేసినట్టు తేలింది. ప్లాస్మోబ్లాస్ట్‌ కణాల్లోనూ దీర్ఘకాల ఇమ్యూనిటీ కనిపించింది. వీటితో పాటు ఇతర కణాలకు బూస్టర్‌ డోసు అవసరం లేదు.

ఎవరికి అవసరమో తెలిసేదెలా?

80 ఏళ్లు దాటినవారిలో యాంటీబాడీలు త్వరగా తగ్గిపోతున్నాయి. వీరిలో కొత్త వేరియంట్లు ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. కాబట్టి వృద్ధులకు బూస్టర్‌ డోసు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి.

అవయవ మార్పిడి జరిగిన వారి సంగతేంటి?

అవయవ మార్పిడి బాధితుల్లో  కొవిడ్‌ యాంటీబాడీల ఉత్పత్తి సరిగా జరగడం లేదు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న 40 మందిలో 39 మంది టీకా తీసుకున్నా, వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదు! 20 మంది మస్క్యులో స్కెలిటల్‌ బాధితుల్లోనూ ఇదే ఫలితాలు వచ్చాయి. అలాగని... ఇలాంటి రోగుల్లో టీకా ప్రభావం ఏమాత్రం లేదని నిర్ధారణకు రావడం సరికాదు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు తీసుకున్న అవయవమార్పిడి బాధితుల్లో.. బూస్టర్‌ డోసు తర్వాత యాంటీబాడీల ఉత్పత్తి జరిగింది. దీంతో ఫ్రాన్స్‌కు చెందిన టీకా నియంత్రణ సంస్థ అవయవమార్పిడి బాధితులకు బూస్టర్‌ డోసు ఇచ్చేలా సిఫార్సు చేసింది.

మొదటి డోసు టీకానే బూస్టర్‌ డోసుగా తీసుకోవాలా?

అలా ఏమీ కాదు. ఫైజర్, మోడెర్నా వంటి ఆర్‌ఎన్‌ఏ టీకాలను... ఆస్ట్రాజెనెకా వంటి అడినో వైరస్‌ టీకాలతో కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నా టీకాల సమర్థతలో ఎలాంటి తేడా ఉండదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని