ఆహార భద్రతకు చిరుధాన్యాల భరోసా

ప్రపంచ ఆహార భద్రతకు చిరుధాన్యాలు భరోసానిస్తాయని, చెడు ఆహార అలవాట్ల నుంచి దూరం జరగడానికి చక్కని పరిష్కార మార్గం చూపుతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 19 Mar 2023 05:25 IST

మరిన్ని పోషకాల ఉత్పత్తులపై దృష్టి సారించండి
శాస్త్రవేత్తలకు ప్రధాని పిలుపు

దిల్లీ: ప్రపంచ ఆహార భద్రతకు చిరుధాన్యాలు భరోసానిస్తాయని, చెడు ఆహార అలవాట్ల నుంచి దూరం జరగడానికి చక్కని పరిష్కార మార్గం చూపుతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో చిరుధాన్యాల వాటా 5శాతం నుంచి 6శాతమే ఉందని, మరిన్ని పోషకాలను జోడించడంద్వారా వాటి వినియోగాన్ని పెంచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారమిక్కడ అంతర్జాతీయ చిరుధాన్యాల (శ్రీఅన్న) సదస్సును ఆయన ప్రారంభించారు. ‘ప్రస్తుతం ప్రపంచం రెండు రకాల సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇందులో ఒకటి దక్షిణ ప్రాంతంలో ఆహార సంక్షోభమని, రెండోది ఉత్తర ప్రాంతంలో చెడు ఆహారపు అలవాట్లవల్ల వచ్చే వ్యాధులని తెలిపారు. ఈ 2 చోట్లా వ్యవసాయంలో విపరీతంగా రసాయనాలను వాడుతున్నామని వివరించారు. ఇటువంటి వాటికి ‘శ్రీఅన్న’ పరిష్కారం చూపుతుందన్నారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా తపాలా బిళ్లను, 75 రూపాయల నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా కేంద్రాన్ని (ఐకార్‌) సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా ప్రకటించారు. ఈ సదస్సులో గుయానా, మాల్దీవులు, మారిషస్‌, శ్రీలంక, సూడాన్‌, సురినామ్‌, గాంబియా వ్యవసాయ మంత్రులు పాల్గొన్నారు.

పద్మశ్రీ గ్రహీతకు పాదాభివందనం

చిరుధాన్యాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన 107 ఏళ్ల పాపమ్మాళ్‌ అనే సేంద్రియ రైతుకు ప్రధాని పాదాభివందనం చేశారు. తమిళనాడు కోయంబత్తూరు సమీపంలోని తేకంబట్టికి చెందిన పాపమ్మాళ్‌ పద్మశ్రీ (2021) అవార్డు గ్రహీత. సదస్సులో ప్రధానికి ఆమె శాలువా కప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు