హిందువుల సహనాన్ని పదే పదే పరీక్షిస్తారా?.. ‘ఆదిపురుష్‌’పై విచారణలో అలహాబాద్‌ హైకోర్టు

‘‘హిందువులు చాలా క్షమాగుణం ఉన్నవారు. అలాగని ప్రతిసారీ వారి సహనాన్ని ఎందుకు పరీక్షిస్తారు? సభ్యత చూపుతూ సహనంతో ఉన్నారు కదా అని అణచివేతకు దిగడం సరైనదేనా?’’ అని అలహాబాద్‌ హైకోర్టు ధర్మాసనం మంగళవారం ప్రశ్నించింది.

Updated : 28 Jun 2023 07:38 IST

లఖ్‌నవూ: ‘‘హిందువులు చాలా క్షమాగుణం ఉన్నవారు. అలాగని ప్రతిసారీ వారి సహనాన్ని ఎందుకు పరీక్షిస్తారు? సభ్యత చూపుతూ సహనంతో ఉన్నారు కదా అని అణచివేతకు దిగడం సరైనదేనా?’’ అని అలహాబాద్‌ హైకోర్టు ధర్మాసనం మంగళవారం ప్రశ్నించింది. రామాయణ గాథ ఆధారంగా ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం ‘ఆదిపురుష్‌’లో కీలక పాత్రలను చిత్రీకరించిన తీరుపై కోర్టు విస్మయం వ్యక్తపరచింది. ఈ చిత్రంపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న లఖ్‌నవూ ధర్మాసనం ‘ఆదిపురుష్‌’ హిందీ సంభాషణల రచయిత మనోజ్‌ ముంతశిర్‌ను ఇంప్లీడ్‌ చేయాలన్న దరఖాస్తును ఆమోదిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. చిత్ర ప్రారంభంలో రామాయణంతో సంబంధం లేదంటూ ప్రదర్శించిన డిస్‌క్లెయిమర్‌ను ఆమోదించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. ‘‘రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు, లంక.. ఇలా అందరినీ చూపించి డిస్‌క్లెయిమర్‌ ప్రదర్శిస్తే జనం ఎలా నమ్ముతారు?’’ అని సెలవుకాల ధర్మాసనంలోని జస్టిస్‌ రాజేశ్‌సింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ శ్రీ ప్రకాశ్‌సింగ్‌ చిత్రబృందాన్ని నిలదీశారు. ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రంజన అగ్నిహోత్రి వాదించారు. ‘ఇది వాల్మీకి రామాయణం కాదు.. తులసీదాసు రాసిన రామచరిత మానస్‌ కాదు’ అని కోర్టు దృష్టికి తెచ్చారు.

సెన్సార్‌ ధ్రువపత్రాన్ని కేంద్రం పునఃసమీక్షిస్తుందా?

‘ఆదిపురుష్‌’ చిత్రానికి కేంద్ర సెన్సార్‌బోర్టు జారీ చేసిన ధ్రువపత్రాన్ని పునఃసమీక్షించే ఆలోచన ఏదైనా కేంద్ర ప్రభుత్వానికి ఉందా అనే సమాచారం తెలపాలని డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌బీ పాండేను ధర్మాసనం కోరింది. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 1952 చట్టంలోని సెక్షన్‌ 6 కింద తనకున్న పునఃసమీక్ష అధికారాలను ఉపయోగించి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందా అన్నది తెలియజేయాలని పాండేను కోరుతూ తదుపరి విచారణను బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు