Germany : ఆ పాపను త్వరగా అప్పగించండి.. జర్మన్‌ రాయబారికి భారత విదేశాంగ శాఖ సూచన

జర్మనీలో (Germany) ఏడాదిన్నరగా చిక్కుకుపోయిన చిన్నారి అరిహా షా కేసు చిక్కుముడి ఇంకా వీడలేదు. ఈ నేపథ్యంలో విదేశాంగశాఖ (External Affairs) స్పందించింది.

Published : 03 Aug 2023 19:36 IST

దిల్లీ : జర్మనీలో (Germany) చిక్కుకుపోయిన తమ పాప అరిహా షాను వెనక్కి తీసుకురావడానికి ముంబయికి చెందిన భవేష్‌ షా, ధారా షా కొన్ని నెలలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారతీయురాలైన ఆ చిన్నారిని జర్మనీ అధికారులు తమ కస్టడీలో ఉంచుకోవడం ఆమె సాంస్కృతిక, ఇతర హక్కులకు భంగం కలిగించినట్లవుతుందని పేర్కొంది. ఈ విషయాన్ని జర్మన్‌ రాయబారి అకెర్‌మాన్‌కు వివరించామని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. ‘అరిహాను త్వరగా భారత్‌కు రప్పించేలా చూడాలని రాయబారిని కోరాము. మేము జర్మనీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఆ చిన్నారిని పంపించమని ఒత్తిడి చేస్తూనే ఉన్నామని’ ఆయన చెప్పారు. కాగా, బుధవారం కొందరు ఎంపీలు విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జై శంకర్‌ను కలిసి అరిహా తల్లిదండ్రుల ఆవేదన తీర్చాలని కోరారు. ఎంపీలు సుప్రియా సూలే, వందన చౌహాన్‌, జయాబచ్చన్‌, ప్రియాంక చతుర్వేది, రజనీ పాటిల్‌లు ఆయనను కలిసి పరిస్థితిని వివరించారు.

అమిత్‌షా, అధిర్‌ రంజన్‌చౌధరీ మధ్య ఆసక్తికర సంభాషణ

అసలేం జరిగిందంటే..

ముంబయికి చెందిన భవేష్‌ షా, ధారా షా దంపతులు 2018లో ఉపాధి నిమిత్తం జర్మనీకి వెళ్లారు. అక్కడే వారికి ఓ ఆడబిడ్డ అరిహా షా జన్మించింది. ఆ పాపకు సుమారు ఏడాది వయసున్నప్పుడు ఆడుకుంటూ కింద పడిపోవడంతో ప్రైవేటు అవయవం వద్ద గాయమైంది. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్ఛార్జ్‌ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆస్పత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. పాపను చెకప్‌కు తీసుకురావాలని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు వెళ్లారు. అయితే, అప్పటికే అక్కడికి వచ్చిన శిశు సంరక్షణ అధికారులు.. జర్మనీలో పుట్టిన ఆ పాప సంరక్షణ తమదేనని, చిన్నారిని ఇవ్వబోమని తేల్చిచెప్పారు. చిన్నారికి అయిన గాయం తీరు కారణంగా ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చన్న అనుమానాలతో ఆ పాపను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

అయితే, ఈ కేసులో పోలీసులు దర్యాప్తు జరపగా.. లైంగిక వేధింపులు జరగలేదని కేసు మూసేశారు. పాపను అప్పగించాలని అప్పటి నుంచి జర్మనీలోని చిన్నారుల సంరక్షణ అధికారులను వేడుకున్నా.. వారు తల్లిదండ్రులపైనే తిరిగి కేసు పెట్టారు. తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచే అర్హతను నిరూపించుకోవాలని కోర్టు ఆదేశించడంతో... చిన్నారి సంరక్షణ కేంద్రంలోనే ఉండిపోయింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని