Chandrayaan 4: చంద్రయాన్‌-4 కోసం ఇస్రో కసరత్తు

చంద్రయాన్‌-3 అందించిన విజయంతో జాబిల్లిపైకి తదుపరి ప్రయోగం కోసం భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) రంగం సిద్ధం చేస్తోంది.

Published : 20 Nov 2023 07:29 IST

పుణె: చంద్రయాన్‌-3 అందించిన విజయంతో జాబిల్లిపైకి తదుపరి ప్రయోగం కోసం భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) రంగం సిద్ధం చేస్తోంది. చంద్రయాన్‌-4/లూపెక్స్‌ పేరుతో చేపట్టే ఈ ప్రయోగంలో భాగంగా చందమామ నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి ఇస్రోకు చెందిన ‘స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌’ డైరెక్టర్‌ నీల్‌ దేశాయ్‌ పుణెలో వివరించారు. ‘‘చంద్రుడి ఉపరితలంపై లూనార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ మిషన్‌ (లూపెక్స్‌)ను సిద్ధం చేస్తున్నాం. చంద్రయాన్‌-3లోని ల్యాండర్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగింది. చంద్రయాన్‌-4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ దిగుతుంది. ఇందులో 350 కిలోల బరువున్న రోవర్‌ను (చంద్రయాన్‌-3లో రోవర్‌ బరువు 30 కిలోలు) పంపనున్నాం. ఇది కిలోమీటరు మేర చంద్రుడిపై తిరుగుతుంది. చంద్రయాన్‌-3 మిషన్‌ జీవిత 14 రోజులు కాగా.. చంద్రయాన్‌-4 సుమారు వంద రోజులు పనిచేస్తుంది. ఈ సమయంలో రోవర్‌లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయి. ఈ ప్రాజక్టు కోసం రెండు వాహకనౌకలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది’’ అని నీల్‌ దేశాయ్‌ వెల్లడించారు. దీని నిమిత్తం జపాన్‌ అంతరిక్ష సంస్థతో కలిసి ఇస్రో పనిచేస్తోందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని