EPFO: జనన ధ్రువీకరణకు ఆధార్‌ చెల్లదు: ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులు జనన ధ్రువీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితా నుంచి ఆధార్‌ కార్డును తొలగించింది.

Updated : 19 Jan 2024 08:37 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులు జనన ధ్రువీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితా నుంచి ఆధార్‌ కార్డును తొలగించింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపై ఆధార్‌ కార్డును ప్రాథమిక గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా మాత్రమే పరిగణించాలని, జనన ధ్రువీకరణకు ప్రామాణికం కాదని ఈపీఎఫ్‌వో ఈ నెల 16న ఉత్తర్వులు విడుదల చేసింది. దానికి సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ గురువారం ఆమోదం తెలిపారు. ఇటీవల పలు కేసుల్లో న్యాయస్థానాలు ఆధార్‌ను జనన ధ్రువీకరణ పత్రంగా గుర్తించలేమని తీర్పును వెల్లడించాయి. దీంతో ఆధార్‌ ప్రామాణికంగా పుట్టిన తేదీలో మార్పులు చేయలేమని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. ఇకపై ఖాతాదారులు జనన ధ్రువీకరణ కోసం ఈ కింది పత్రాలను సమర్పించవచ్చని తెలిపింది.

  • జనన ధ్రువీకరణ పత్రం (జనన, మరణాల విభాగం రిజిస్ట్రార్‌ జారీ చేసేది)
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసే మార్కుల జాబితా
  • పాఠశాల బదిలీ (టీసీ) లేదా స్కూల్‌ లీవింగ్‌ సర్టిఫికెట్‌
  • ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ (వాటిపై పేరు, పుట్టిన తేదీ వివరాలు ఉంటేనే..)
  • సర్వీస్‌ రికార్డు ఆధారంగా జారీ చేసిన ధ్రువపత్రం
  • కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పింఛను సర్టిఫికెట్‌
  • ప్రభుత్వం జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం
  • పాన్‌ కార్డు, పాస్‌పోర్టు, సివిల్‌ సర్జన్‌ జారీ చేసిన మెడికల్‌ సర్టిఫికెట్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని