పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్‌ పురస్కారం

హైదరాబాద్‌లోని ‘నాగ రామ జపాన్‌ హబ్‌’ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్‌ ప్రభుత్వ ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద రైజింగ్‌ సన్‌, గోల్డ్‌ రేస్‌ విత్‌ రోసెట్‌’ పురస్కారం అందుకున్నారు.

Updated : 09 May 2024 05:55 IST

 చెన్నైలో కాన్సుల్‌ జనరల్‌ అందజేత

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ‘నాగ రామ జపాన్‌ హబ్‌’ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్‌ ప్రభుత్వ ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద రైజింగ్‌ సన్‌, గోల్డ్‌ రేస్‌ విత్‌ రోసెట్‌’ పురస్కారం అందుకున్నారు. చెన్నైలోని జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ తకహషి మునియో, ఆయన సతీమణి తకహషి మిత్సుయోలు రామభద్ర, ఆయన సతీమణి నాగనాథలకు బుధవారం ఈ పురస్కారం అందజేశారు. భారతదేశంలో జపాన్‌ సంస్కృతి వ్యాప్తి, స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడానికి చేసిన కృషికి గుర్తింపుగా జపాన్‌ ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. ఈ దిశగా దాదాపు మూడు దశాబ్దాలుగా చేస్తున్న కృషికి గాను ఆయనకు పురస్కారాన్ని అందజేసినట్లు జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన రామభద్ర 1978లో మిత్సుబిషి ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ ద్వారా రెండేళ్ల సాంకేతిక శిక్షణ కోర్సుకు ఎంపికై జపాన్‌ వెళ్లారు. శిక్షణ అనంతరం ఆయన చాలాకాలం అక్కడే పనిచేశారు. 1995లో హైదరాబాద్‌కు వచ్చి తొలుత ‘అసాభాను టెక్నాలజీ సర్వీస్‌ లిమిటెడ్‌’ను ఏర్పాటు చేశారు. దానిద్వారా శ్రీశైలం జలవిద్యుత్‌ ప్రాజెక్టుతో పాటు దిల్లీ మెట్రో ప్రాజెక్టు, దేశంలోని పలు ప్రాజెక్టులకు జపాన్‌ కంపెనీల నుంచి యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. అలాగే అప్పట్లో ఆయన ‘అసాభాను జపాన్‌ కేంద్రం’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి భారత్‌, జపాన్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలు, పరస్పర అవగాహనపై పలు సభలు, సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలను నిర్వహించారు. తనకు పురస్కారం దక్కడంపై రామభద్ర ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. జపాన్‌ తనకు రెండో జన్మభూమి అని, ఆ దేశ సంస్కృతి తమ జీవన విధానంలో భాగమైందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని