MHA: జమ్మూకశ్మీర్‌ ముస్లిం లీగ్‌ (MLJK-MA)పై కేంద్రం నిషేధం..

Muslim League Jammu Kashmir (Masarat Alam faction): ముస్లిం లీగ్‌ జమ్మూకశ్మీర్‌ సంస్థను కేంద్రం నిషేధిత సంస్థగా ప్రకటించింది. దీనిపై ఐదేళ్ల పాటు నిషేధం అమలులో ఉంటుందని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Published : 27 Dec 2023 17:06 IST

దిల్లీ: ముస్లిం లీగ్‌ జమ్మూకశ్మీర్‌ (మసరత్‌ ఆలం వర్గం) (MLJK-MA) సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్నందుకు గానూ దీనిపై వేటు వేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు.

‘‘ముస్లిం లీగ్‌ జమ్మూకశ్మీర్‌ (మసరత్‌ ఆలం వర్గం) సంస్థను ఉపా చట్టం కింద నిషేధిత సంస్థగా ప్రకటిస్తున్నాం. ఈ సంస్థ సభ్యులు.. జమ్మూకశ్మీర్‌లో దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఉగ్రవాదానికి మద్దతు అందిస్తుండటమే గాక.. జమ్మూకశ్మీర్‌లో ఇస్లామిక్‌ పాలనను ఏర్పాటు చేసేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు’’ అని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వం, సమగ్రతకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడినా.. వారిని వదిలిపెట్టబోమన్నారు. అలాంటి వారు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ప్రతి సైనికుడు కుటుంబ సభ్యుడే.. ఆర్మీ జోలికి వస్తే ఊరుకోం: రాజనాథ్‌ వ్యాఖ్య

అటు కేంద్ర హోంశాఖ (MHA) కూడా దీనిపై ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థ పాక్‌ అనుకూల ప్రచారం చేస్తోందని, ముఖ్యంగా దీని ఛైర్మన్‌ మసరత్‌ ఆలం.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని హోంశాఖ తమ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అందువల్ల ఈ సంస్థపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది.

ముస్లిం లీగ్‌ జమ్మూకశ్మీర్‌ (మసరత్‌ ఆలం వర్గం) సంస్థకు మసరత్‌ ఆలం నేతృత్వం వహిస్తున్నాడు. ఇతడే అతివాద ‘ఆల్‌ ఇండియా హురియత్‌ కాన్ఫరెన్స్‌’ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

2010 నాటి జమ్మూకశ్మీర్‌ అల్లర్లతో మసరత్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఇదే కేసులో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థికసాయం చేశాడన్న అభియోగంతో 2019లో ఎన్‌ఐఏ అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం అతడు తిహాడ్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని