Visa: అమెరికాలోనే H-1B వీసా రెన్యువల్‌.. దరఖాస్తు తేదీ, అర్హత వివరాలివే..!

H-1B Visa: హెచ్‌-1బీ వీసా దారులు అమెరికాలోనే తమ వీసాలను రెన్యువల్‌ చేసుకునేందుకు పైలట్‌ ప్రోగ్రామ్ వచ్చే ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు తేదీలు, అర్హత వంటి వివరాలను అగ్రరాజ్యం ప్రకటించింది.

Updated : 21 Dec 2023 16:49 IST

వాషింగ్టన్‌: హెచ్‌-1బీ వీసా (H-1B visa) రెన్యువల్‌ విధానాన్ని మరింత సరళీకరించేలా అమెరికా (USA) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విదేశీ వృత్తి నిపుణులు తమ హెచ్‌-1బీ వీసాలను (H-1B visa) అమెరికాలోనే రెన్యువల్‌ (renewal) చేసుకునేలా ఓ పైలట్‌ ప్రోగ్రామ్‌కు బైడెన్‌ సర్కారు ఇటీవల పచ్చజెండా ఊపింది. ఈ ప్రోగ్రామ్‌ వచ్చే ఏడాది జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది.

మొదట 20,000 వీసాల రెన్యువల్‌కు పైలట్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశ రెన్యువల్‌ అవకాశాన్ని కేవలం భారతీయులు, కెనడియన్లకు మాత్రమే కల్పిస్తున్నట్లు యూఎస్‌ ఫెడరల్‌ రిజిస్ట్రీ తమ నోటీసుల్లో తెలిపింది. మరి ఈ రెన్యువల్‌ ప్రోగ్రామ్‌కు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలను కూడా ఆ నోటీసుల్లో వెల్లడించింది.

దరఖాస్తు తేదీలివే..

ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా 2024 జనవరి 29 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు హెచ్‌-1బీ వీసాదారులు తమ వీసాలను అమెరికాలోనే రెన్యువల్‌ చేసుకోవచ్చు. ప్రతి వారం 4వేల చొప్పున అప్లికేషన్‌ స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో 2వేలు భారతీయులకు కేటాయించనున్నారు. జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 26వ తేదీల్లో ఈ స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక, వీసా రెన్యువల్‌ కోసం రాతపూర్వక వివరణ, సంబంధిత పత్రాల సమర్పణకు ఏప్రిల్‌ 15, 2024 వరకు గడువు కల్పిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.

అర్హులు ఎవరంటే..

ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌లో కేవలం హెచ్‌-1బీ వీసాలను మాత్రమే రెన్యువల్‌ చేయనున్నారు. 2020 జనవరి 1 నుంచి 2023 ఏప్రిల్‌ 1 మధ్య మిషన్‌ కెనడా జారీ చేసిన వీసాలు, 2021 ఫిబ్రవరి 1 నుంచి 2021 సెప్టెంబరు 30 మధ్య మిషన్‌ ఇండియా జారీ చేసిన వీసాలను మాత్రమే రెన్యువల్‌ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

దరఖాస్తుదారులు https://travel.state.gov/content/travel/en/us-visas/employment/domestic-renewal.html వెబ్‌సైట్‌కు వెళ్లి తమ రెన్యువల్‌ అప్లికేషన్లను సమర్పించొచ్చు. లేదా www.regulations.gov వెబ్‌సైట్‌లో 1400-AF79 అని సెర్చ్‌ చేసి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రెన్యువల్‌ కోసం దరఖాస్తుదారులు 205 డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.17వేలు) చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్‌-రిఫండబుల్‌ అని విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఇవి తప్పనిసరి..

  • దరఖాస్తుదారులు గతంలో వీసా అప్లికేషన్‌ సమయంలో 10 వేలిముద్రలను సమర్పించి ఉండాలి
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ మినహాయింపు కోసం అర్హులై ఉండాలి
  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆమోదం లభించిన, గడువు తీరని హెచ్‌-1బీ పిటిషన్‌ను కలిగి ఉండాలి.

విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో పని చేయడానికి ఇచ్చే అనుమతి పత్రాన్ని హెచ్‌-1బీ వీసా అంటారు. సాధారణంగా వీటి గడువు మూడేళ్లలో తీరిపోతుంది. దాన్ని మరో మూడేళ్లు పొడిగించుకోవడానికి వీసాదారులు అమెరికా నుంచి స్వదేశం తిరిగిరావడమో లేక మరేదైనా దేశానికి వెళ్లి పునరుద్ధరించుకోవడమో చేయాలి. అయితే, ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చినపుడు హెచ్‌-1బీ వీసాలను అమెరికాలోనే పునరుద్ధరిస్తామని బైడెన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా పైలట్‌ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు