P.v.Narasimha Rao: అపర మేధావి.. ఆర్థిక సంస్కరణల ధీశాలి

రిటైర్మెంట్‌కు సిద్ధమైన ఓ రాజకీయ కురు వృద్ధుడు కొన ఊపిరితో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోశారు. దేశ ప్రజలు నేడు అనుభవిస్తున్న చాలా సౌకర్యాలు ఆయన సంస్కరణల ఫలితమే.   

Updated : 09 Feb 2024 17:53 IST

సాధారణంగా రూపాయి విలువ పతనమైతే ఆర్థిక వ్యవస్థ కుంగిపోతోందని ఆందోళన చెందుతాం.. కానీ, మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి గతంలో ఓసారి ప్రభుత్వమే కరెన్సీ విలువను భారీగా తగ్గించింది. నాడు ఇచ్చిన ఆ షాక్‌ ట్రీట్‌మెంట్‌తో ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. అంపశయ్యపై నుంచి దిగి.. ఇప్పుడు రేసుగుర్రంలా పరుగులు పెడుతోంది. భారత్‌కు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన ఆ ఆర్థిక వైద్యుడి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. 9వ ప్రధానిగా దేశానికి ఆర్థిక జవసత్వాలు నింపిన తెలుగు బిడ్డ. 

అనుకోకుండా రాజకీయ పునరాగమనం..

నెహ్రూ కుటుంబానికి పీవీ అత్యంత సన్నిహితుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, కేంద్ర హోం, విదేశీ వ్యవహారాలు, రక్షణశాఖల మంత్రిగా పనిచేశారు. అప్పటికే ఎనిమిది ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు. 1991 నాటికి ఆయన రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకొని ఎన్నికల్లో నిలబడలేదు. రాజీవ్‌ గాంధీ హత్య తర్వాత అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. వివాదరహితుడు, అందరికీ ఆమోదయోగ్యుడు కావడంతో ప్రధాని పదవి ఆయన్ను వరించింది. 1991 జూన్‌ 21న బాధ్యతలు స్వీకరించారు. కానీ, పదవి ఆయనకు ముళ్లకిరీటమే.

దేశ ఆర్థిక పరిస్థితి నాడు ఘోరంగా ఉండేది. మన విదేశీ మారకద్రవ్యం నిల్వలు కేవలం బిలియన్‌ డాలర్ల కంటే తక్కువ (ఫోర్బ్స్‌ కథనం ప్రకారం) ఉన్నాయి. కొన్ని వారాల దిగుమతుల చెల్లింపులకు ఇవి సరిపోతాయి. విదేశీ అప్పు కొండలా పేరుకుపోయింది. దీనికి తోడు ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశం దివాలా ముప్పు అంచున వేలాడుతోంది. దీంతో బాధ్యతలు చేపట్టిన వెంటనే పీవీ ఆర్థిక పరిస్థితిపై దృష్టిపెట్టారు. ఆయన తొలుత ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఐజీ పటేల్‌కు ఆర్థిక పగ్గాలు ఇవ్వాలని భావించారు.  కానీ, ఆయన సుముఖంగా లేకపోవడంతో మన్మోహన్‌ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు.  సింగ్‌ కూడా ఆర్‌బీఐ గవర్నర్‌గా చేసిన వ్యక్తే.

విదేశీ మారక ద్రవ్యం సంపాదించాల్సిందే.. 

1991 నాటికి భారత్‌ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మూసేసి ఉండేది. ఎగుమతులు అతి తక్కువ. విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా స్వల్పం. వీటిని పెంచేందుకు తక్షణమే రెండు చర్యలు చేపట్టాలని పీవీ సర్కారు నిర్ణయించింది. వీటిల్లో ఒకటి రూపాయి విలువ తగ్గింపు. ఒకేసారి భారీగా విలువలో కోత విధిస్తే ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుందని రెండు దఫాలుగా ఈ నిర్ణయాన్ని అమలు చేశారు. 

  • 1991 జులై 1వ తేదీన దేశ చరిత్రలో తొలిసారి రూపాయి విలువను 9శాతం తగ్గించారు. ఆ షాక్‌ నుంచి కోలుకుంటుండగా.. రెండు రోజుల తర్వాత మరో 11 శాతం విలువను కుదించారు.  ఎగుమతులు చౌకగా మారి అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీని తట్టుకొని నిలదొక్కుకునే పరిస్థితిని ఇది కల్పించింది. 
  • అదే ఏడాది జులై 4-18 తేదీల మధ్య రిజర్వ్‌ బ్యాంక్‌లో ఉన్న బంగారం నిల్వలను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వద్ద తాకట్టు పెట్టి 400 మిలియన్‌ డాలర్ల రుణం తీసుకొచ్చారు. వాస్తవానికి అప్పటికే ఎస్‌బీఐ మే నెలలో 20 టన్నుల బంగారాన్ని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్విట్జర్లాండ్‌కు విక్రయించి 200 మిలియన్‌ డాలర్లు సమకూర్చుకొంది.

దిగుమతి లైసెన్సుల విధానం సరళీకరణ..

దేశీయంగా పరిశ్రమలు వేగంగా పుట్టుకువచ్చేలా కీలకమైన యంత్రాలు, పరికరాలు, ముడి సరకుల దిగుమతులకు లైసెన్స్‌ విధానాల్లో మార్పులు తెచ్చింది. ఫలితంగా ఉత్పత్తి రంగానికి ఊతం లభించింది. అదే సమయంలో అనవసరమైన వస్తువుల దిగుమతులను నిరుత్సాహపర్చేలా నిర్ణయాలు తీసుకొన్నారు.  ట్రేడబుల్‌ ఎగ్జిమ్‌ స్క్రిప్‌లను కేటాయించడం మొదలుపెట్టింది. ప్రైవేటు కంపెనీలు తమకు అవసరమైనవి దిగుమతి చేసుకొనేలా స్వేచ్ఛను ఇచ్చింది. 

భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ

* 1991 బడ్జెట్‌కు సరిగ్గా ముందు.. కొత్త పారిశ్రామిక విధానాన్ని పీవీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటివరకు పరిశ్రమలకు, పెట్టుబడులకు ఇబ్బందిగా మారిన లైసెన్స్‌ విధానం నుంచి ఆర్థిక వ్యవస్థను దూరంగా తీసుకెళ్లింది. దీనికింద మోనోపోలిస్‌ అండ్‌ రిస్ట్రిక్టివ్‌ ట్రేడ్‌ ప్రాక్టీస్‌ యాక్ట్‌లో మార్పులు తెచ్చింది. వ్యాపారాల పునర్‌ వ్యవస్థీకరణ, విలీనం, కలయికలను సులభతరం చేసింది. 

* జాతీయ భద్రతకు సంబంధించిన వాటిల్లో మినహా చాలా రంగాల్లో ప్రభుత్వ సంస్థల ఏకఛత్రాధిపత్యాన్ని తొలగించింది.  వీటిల్లో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆటోమేటిక్‌ అనుమతుల విధానంలోకి తెచ్చింది.

* 18 పరిశ్రమలు మినహా మిగిలిన వాటికి పెట్టుబడితో సంబంధం లేకుండా లైసెన్స్‌ల అవసరాన్ని తొలగించింది. 

భారత్‌కు మేలి మలుపు..

1991 జులై 24న ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటికే గత కొన్ని వారాలుగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు ఇది కొనసాగింపు. దీనిలో కొన్ని చేదు గుళికలను మన ఆర్థిక వ్యవస్థ చేత తినిపించారు. 

  • కార్పొరేట్‌ పన్నును మరో 5 పాయింట్లు పెంచి 45 శాతానికి చేర్చారు. 
  • బ్యాంక్‌ డిపాజిట్లు వంటి ఆర్థిక లావాదేవీల్లో మూలం వద్దే పన్ను విధించేలా టీడీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. 
  • గ్యాస్‌ సిలిండర్లు, ఎరువులు, పెట్రోల్‌, కిరోసిన్‌ ధరల పెంపుతో పాటు.. పంచదారపైనా రాయితీని తొలగించారు. సబ్సిడీలను తగ్గించి.. ద్రవ్యలోటును కుదించాలన్నది ఇక్కడ ప్రభుత్వ వ్యూహం. 
  • అప్పటివరకు లెక్కల్లో చూపించని సొమ్మును ప్రకటించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. కేసులు, వడ్డీలు, అపరాధ రుసుముల నుంచి మినహాయించారు. 
  • దేశీయ పరిశ్రమలను రక్షించేందుకు విధించే దిగుమతి పన్నులను గణనీయంగా తగ్గించారు. 

‘ఐడియాకు సమయం ఆసన్నమైతే.. దానిని భూమిపై ఏ శక్తి ఆపలేదు’ అన్న విక్టర్‌ హ్యూగో మాటలతో మన్మోహన్‌ తన చారిత్రక బడ్జెట్‌ ప్రసంగాన్ని ముగించారు. ఎరువుల ధరల పెంపుపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఐఎంఎఫ్‌కు దేశాన్ని అమ్మేస్తున్నారన్న నిందలను పీవీ సర్కారు మోసింది. ఆ తర్వాత చిన్న చిన్న మినహాయింపులను ప్రభుత్వం ప్రకటించి ఊరుకొంది. 

ఆ తర్వాత మరో ఎనిమిది నెలలు..

బడ్జెట్‌తో ప్రభుత్వం చేతులు దులుపుకోలేదు. ఆ తర్వాత కూడా మరో ఎనిమిది నెలల పాటు సంస్కరణల జోరును కొనసాగించింది. ఎగుమతులను ప్రోత్సహించడానికి సెకండ్‌ ట్రేడ్‌ పాలసీ, చిన్న సంస్థలకు ప్రోత్సాహకాలను అందించింది. ఆర్థికరంగంలో సంస్కరణలను సూచించేందుకు ఆర్‌బీఐ గవర్నర్‌ ఎం.నరసింహన్‌ నేతృత్వంలో కమిటీని వేసింది. ఆ తర్వాత పన్ను సంస్కరణల బాధ్యతలను ఆర్థికవేత్త రాజ చల్లయ్య నేతృత్వంలోని మరో బృందానికి అప్పగించింది.

ఫలితం చూపిన వైద్యం..

ఆ తర్వాత రెండున్నరేళ్లలో ద్రవ్యోల్బణం 17శాతం నుంచి 8.5 శాతానికి దిగొచ్చింది. 1991 జూన్‌లో 1.2 బిలియన్‌ డాలర్లు ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు 1994 నాటికి 15 బిలియన్‌ డాలర్లకు చేరాయి. నాలుగేళ్లలో ఎగుమతులు రెండు రెట్లు పెరిగాయి. ద్రవ్యలోటు 1991లో 8.4శాతం ఉండగా.. అది 1993 నాటికి 5.7 శాతానికి చేరింది. వృద్ధి రేటు 1.1శాతం నుంచి 4శాతానికి పెరిగింది. పేదరికం తగ్గుముఖం పట్టింది.. పేదలు, సంపన్నుల మధ్య వ్యత్యాసం కొంత కుదించగలిగారు. దేశంలో వాణిజ్యం సులభతరమైంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఆధునిక భారత్‌ ఆర్థికవ్యవస్థకు పీవీ సర్కారు నాడు శక్తిమంతమైన పునాది వేసింది.   

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని