Indian Navy: బోట్లను జారవిడిచి.. కమాండోలను దించి.. నడిసంద్రంలో 40 గంటల ఆపరేషన్‌

సముద్రపు దొంగల చేతిలో నుంచి ఓ వాణిజ్య నౌకను కాపాడేందుకు యుద్ధ బోట్లను సముద్రంలో జారవిడవడంతోపాటు మెరైన్‌ కమాండోలను రంగంలోకి దించినట్లు భారత నౌకాదళం తెలిపింది.

Published : 18 Mar 2024 00:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్‌కు గురైన ఓ వాణిజ్య నౌక (MV Ruen)ను భారత నౌకాదళం (Indian Navy) విడిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో దాదాపు 40 గంటలపాటు సాహసోపేత ఆపరేషన్‌ సాగిందని నేవీ వెల్లడించింది. ఇందులో భాగంగా వాయుసేనకు చెందిన విమానం (C-17) నుంచి యుద్ధ బోట్లను సముద్రంలో జారవిడవడంతోపాటు మెరైన్‌ కమాండో (MARCOS)లను రంగంలోకి దించినట్లు తెలిపింది.

మాల్టా జెండాతో కూడిన నౌకను సముద్రపు దొంగలు గతేడాది డిసెంబరులో హైజాక్‌ చేశారు. ఇతర దేశాల నౌకలను దోచుకునేందుకు దానిని ఉపయోగిస్తున్నారని భారత నేవీ గుర్తించింది. దానిని రక్షించేందుకు ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ సుభద్రలతోపాటు సీ గార్డియన్‌ డ్రోన్లను మోహరించింది. ఆపరేషన్‌లో భాగంగా భారత తీరానికి దాదాపు 2600 కిలోమీటర్ల దూరంలో వాయుసేన తన ‘సీ-17’ సరకు రవాణా విమానం ద్వారా రెండు చిన్నపాటి యుద్ధ బోట్ల (CRRC)ను కచ్చితమైన ప్రదేశంలో జారవిడిచింది. మెరైన్‌ కమాండోలూ కిందికి దిగి.. దొంగల ఆటకట్టించారు. మొత్తం 17 మంది బందీలను విడిపించి.. 35 మంది పైరట్లను అదుపులోకి తీసుకున్నారు.

సముద్రపు దొంగల ఆటకట్టించిన భారత నేవీ

రూ.8 కోట్లకుపైగా విలువైన 37,800 టన్నుల సామగ్రితో కూడిన ఆ నౌకను భారత్‌ తీరానికి తీసుకొస్తామని నేవీ తెలిపింది. వైమానిక, నౌకాదళాల ఉమ్మడి కార్యాచరణ శక్తిసామర్థ్యాలను ఈ విజయం ప్రదర్శిస్తోందని పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో శాంతి, స్థిరత్వాలను బలోపేతం చేయడంతోపాటు దోపిడీని అడ్డుకోవడంలో భారత బలగాల నిబద్ధతను చాటుతుందని చెప్పింది. ఇదిలా ఉండగా.. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై కొంతకాలంగా హూతీ తిరుగుబాటుదారుల దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జలమార్గాలపై నిఘా ఉంచేందుకు మన నౌకాదళం 10కి పైగా యుద్ధనౌకలను మోహరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని