Pakistan: ఇమ్రాన్‌.. నోరుజారడం వల్లే..!

ఒసామా బిన్‌ లాడెన్‌ అమరుడని ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ నోరుజారారని పాకిస్థాన్‌ ప్రభుత్వం పేర్కొంది.

Published : 28 Jun 2021 01:11 IST

లాడెన్‌పై వ్యాఖ్యలతో నష్టనివారణ చర్యలు చేపట్టిన పాకిస్థాన్‌

ఇస్లామాబాద్: అమెరికా బలగాల చేతిలో అంతమైన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను అమరవీరుడంటూ పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ కీర్తించిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు రావడంతో తేరుకున్న పాకిస్థాన్‌.. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నోరుజారి అలా వ్యాఖ్యానించారని పేర్కొంది. బిన్‌ లాడెన్‌ను ఉగ్రవాదిగానే చూస్తున్నామన్న పాకిస్థాన్‌.. మరోసారి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలకు తెరతీసింది.

గతేడాది జూన్‌లో పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించిన ఇమ్రాన్‌ ఖాన్‌.. ఒసామా బిన్‌ లాడెన్‌ను చంపేందుకు అమెరికా బలగాలు పాక్‌లో చేపట్టిన ఆపరేషన్‌ను ప్రస్తావించారు. పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వకుండానే ఇక్కడి గగనతలంలో అడుగుపెట్టి బిన్‌ లాడెన్‌ను చంపి అమరుడిని చేశారని వ్యాఖ్యానించారు. ఆ సందర్భంలో పాకిస్థాన్‌ చాలా ఇబ్బంది పడిందని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. అయితే, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై తొలుత ఓ ఇంటర్వ్యూలో స్పందించిన పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మూద్‌ ఖురేషీ.. ఇమ్రాన్‌ వ్యాఖ్యలు అసందర్భమైనవని అన్నారు. ఓ వర్గం మీడియా వాటిని తప్పుగా చూపించేందుకు ప్రయత్నించాయని చెప్పారు. తాజాగా పాకిస్థాన్‌ సమాచార, సాంకేతిక వ్యవహారాలశాఖ మంత్రి ఫవాద్‌ చౌధురి కూడా ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ నోరుజారి అలా మాట్లాడారని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.

ఇదిలాఉంటే, ఒసామా బిన్‌ లాడెన్‌ను మట్టుబెట్టేందుకు అమెరికా బలగాలు 2011లో ఆపరేషన్‌ నెప్ట్యూన్‌ స్పియర్‌ (ఆపరేషన్ జెరోనిమో)ను చేపట్టాయి. అబొట్టాబాద్‌లోని గారిసన్‌ పట్టణంలో అమెరికా బలగాలు జరిపిన ఆ మెరుపు దాడిలో ఒసామా బిన్‌ లాడెన్‌ హతమయ్యాడు. 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత ఘటన వెనుక ప్రధాన సూత్రధారి లాడెనే. అలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించిన లాడెన్‌.. అమెరికాతో పాటు ప్రపంచ దేశాలకు మోస్ట్‌ వాంటెడ్‌గా తయారయ్యాడు. అంతటి కరడుగట్టిన ఉగ్రవాదిని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మాత్రం అమర వీరుడంటూ కీర్తించడం అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు కారణమయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని