Salman Rushdie: సల్మాన్‌ రష్దీపై దాడిని ఖండించిన భారత్‌

ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీ(Salman Rushdie)పై అమెరికాలో జరిగిన దాడిపై భారత ప్రభుత్వం తొలిసారి స్పందించింది.....

Published : 25 Aug 2022 22:50 IST

దిల్లీ: ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీ(Salman Rushdie)పై అమెరికాలో జరిగిన దాడిపై భారత ప్రభుత్వం తొలిసారి స్పందించింది. ఆయనపై జరిగిన భయంకరమైన దాడిని ఖండిస్తున్నట్టు తెలిపింది. రష్దీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఆగస్టు 12న న్యూయార్క్‌లోని ఓ వేదికపై ప్రసంగానికి సిద్ధమవుతున్న రష్దీపై  ఓ యువకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై స్పందించారు. హింస, ఉగ్రవాదానికి భారత్‌ ఎప్పుడూ వ్యతిరేకమేన్నారు. ‘‘సల్మాన్‌ రష్దీపై జరిగిన భయంకరమైన దాడిని ఖండిస్తున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం’’ అన్నారు.

భారత మూలాలున్న ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ(75)పై ఇటీవల జరిగిన దాడి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. తీవ్ర గాయాలపాలైన రష్దీ కాలేయం దెబ్బతిందని, ఓ కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన బుక్ ఏజెంట్ ఒకరు గతంలో రాయిటర్స్‌కు వెల్లడించారు. అందరూ చూస్తుండగానే వేదికపైకి దూసుకొచ్చి కత్తితో దాడి చేసిన యువకుడు.. న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హాది మతార్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడి సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించిన పోలీసులు.. మతార్‌ ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (IRGC)కు సానుభూతిపరుడని గుర్తించారు. మతార్‌కు, ఐఆర్‌జీసీ మధ్య ప్రత్యక్ష సంబంధాలు లేనప్పటికీ.. నిందితుడి సెల్‌ఫోన్‌లో 2020లో హత్యకు గురైన ఇరాన్ కమాండర్ ఖాసేమ్ సోలేమాని చిత్రాలను గుర్తించారు. ఇదిలా ఉంటే.. రష్దీ రచించిన ‘ది సాతానిక్‌ వెర్సెస్‌‌’ నవల వివాదాలకు కేంద్రబిందువై.. ఆయనకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. 1988 నుంచి ఇరాన్‌లో ఈ నవలను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, రష్దీపై జరిగిన దాడిలో తమ ప్రమేయం ఏమీ లేదని ఇరాన్‌ ప్రకటించింది.

1947లో ముంబయిలో జన్మించిన సల్మాన్‌ రష్దీ.. కొన్నాళ్ల తర్వాత బ్రిటన్‌కు తరలివెళ్లారు. రష్దీ రచించిన మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌ (Midnight Children) నవలకు 1981లో ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ దక్కడంతో ఆయన ఫేమస్‌ అయ్యారు. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు