IN-SPAce: అంతరిక్ష రంగంలో భారత్‌ జోరు.. 14 నెలల్లో 30 ప్రయోగాలకు సిద్ధం!

వచ్చే 14 నెలల్లో సుమారు 30 ప్రయోగాలు నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ‘ఇన్-స్పేస్‌ (IN-SPAce)’ వెల్లడించింది. 

Updated : 08 Feb 2024 20:23 IST

బెంగళూరు: రోదసి రంగంలో మరిన్ని విజయాల నమోదుకు భారత్‌ సిద్ధమవుతోంది. వచ్చే 14 నెలల్లో సుమారు 30 ప్రయోగాలు జరుగుతాయని అంతరిక్ష నియంత్రణ సంస్థ ‘ఇన్-స్పేస్‌ (IN-SPAce)’ వెల్లడించింది. ఇందులో ప్రతిష్ఠాత్మక ‘గగన్‌యాన్‌’ (Gaganyaan)కు సంబంధించిన ఏడు పరీక్షలతోపాటు స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేటు అంకుర సంస్థలకు చెందినవి ఏడు మిషన్లు ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) నాల్గో త్రైమాసికంలో ఇప్పటికే ఒక ప్రయోగం చేపట్టగా.. మరో మూడు సిద్ధంగా ఉన్నాయి. 2024-25లో మిగతావి నిర్వహించనున్నారు. వాటి తేదీలను ప్రకటించాల్సి ఉంది.

ఎక్స్‌పోశాట్‌ ప్రయోగం విజయవంతం

వాతావరణ అంచనా, విపత్తు నిర్వహణ సంబంధిత సేవల కోసం రూపొందించిన ‘ఇన్‌శాట్‌-3డీఎస్‌’ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకుగానూ ‘జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్‌14’ ప్రయోగాన్ని ఇస్రో త్వరలో చేపట్టనుంది. మార్చిలో ‘ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3’.. మూడు పేలోడ్‌లను మోసుకెళ్లనుంది. ‘పీఎస్‌ఎల్‌వీ సీ-58’ జనవరిలోనే దూసుకెళ్లింది. చెన్నైకి చెందిన ‘అగ్నికుల్ కాస్మోస్’ తన మొదటి 3డీ ప్రింటెడ్ రాకెట్ ‘అగ్నిబాణ్‌- సార్టెడ్‌ (Agnibaan-SOrTeD)’ ప్రయోగానికి సిద్ధమైంది.

  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇస్రో..  పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల సాయంతో మూడు చొప్పున, గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి ఏడు పరీక్షలు చేపట్టనుంది.
  • ఇస్రో వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్’.. నాలుగు పీఎస్‌ఎల్‌వీ, రెండు ఎస్‌ఎస్‌ఎల్‌వీ, ఒక ఎల్‌వీఎం-3 మిషన్ నిర్వహించాలని భావిస్తోంది.
  • స్కైరూట్‌ ఏరోస్పేస్ తన ‘విక్రమ్-1’ రాకెట్‌ ద్వారా నాలుగు మిషన్లు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అగ్నికుల్‌ మరో రెండు ‘అగ్నిబాణ్‌’లను నింగిలోకి పంపనుంది.
  • దిగంతరా రీసెర్చ్ అండ్‌ టెక్నాలజీ, ధ్రువస్పేస్, స్పేస్ కిడ్జ్ ఇండియా వంటి కొన్ని స్టార్టప్‌లు, ఐఐటీ-మద్రాస్, మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సీవీ రామన్ గ్లోబల్ యూనివర్శిటీ (ఒడిశా) తదితర విద్యాసంస్థలూ ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని