Medical Students: మన వైద్య విద్యార్థులు విదేశాల్లో వైద్యం చేయొచ్చు

ఎన్‌ఎమ్‌సీకి డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు.. ఇకపై భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో వైద్యం చేయొచ్చు

Updated : 22 Sep 2023 19:03 IST

దిల్లీ: భారతీయ వైద్య విద్యార్థులు ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టీస్‌ చేయొచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.  గతంలో ఉండే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (MCI) స్థానంలో కొత్తగా జాతీయ వైద్యమండలి (NMC)ను ఏర్పాటైన విషయం తెలిసిందే. తాజాగా ఎన్‌ఎమ్‌సీకి  వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (WFME) నుంచి 10 ఏళ్ల కాలానికి గుర్తింపు లభించింది. దీంతో భారత్‌లో  వైద్య విద్య అభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌లలో పీజీ కోర్సుల్లో చేరొచ్చు. దాంతోపాటు ప్రాక్టీస్‌ చేయొచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో ఉన్న 706 వైద్య కళాశాలలు, రాబోయే పదేళ్లలో ఏర్పాటయ్యే వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు పొందుతాయి

- కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ 

అర్హత తప్పనిసరి

ఎన్‌ఎమ్‌సీ గుర్తింపు పొందిన కళాశాలల్లో  వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు విదేశాల్లో ప్రాక్టీస్‌ చేసేందుకు లేదా పీజీ విద్యను అభ్యసించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషన్‌ కమిషన్ ఆన్‌ ఫారెన్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌ (ECFMG) నిర్వహించే యూఎస్‌ఎమ్‌ఎల్‌ఈ పరీక్షలో అర్హత సాధించాలి. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు ఇతర దేశాల్లో ప్రాక్టీస్‌ చేసేందుకు అమెరికాకు చెందిన ఈసీఎఫ్‌ఎమ్‌జీ కింద అనుమతులు మంజూరు చేస్తుంది. ఇందుకోసం అంతర్జాతీయ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌లు (IMG) యూఎస్‌ఎమ్‌ఎల్‌ఈ పరీక్షలో అర్హత సాధించి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని