ISRO: ఇస్రో మరో ఘనత.. గగన్‌యాన్‌ ఇంజిన్‌ సిద్ధం..!

గగన్‌యాన్‌కు సంబంధించి కీలక దశను ఇస్రో దాటింది. మానవ ప్రయాణానికి అనుకూలమైన ఇంజిన్లను విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. 

Updated : 21 Feb 2024 13:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ (Gaganyaan ) ప్రాజెక్టులో ఇస్రో  (ISRO) మరో ముందడుగు వేసింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన CE20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ను సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు నేడు సోషల్‌ మీడియా ఎక్స్‌లో ప్రకటించింది. మానవ యాత్ర సమయంలో వినియోగించే ఎల్‌వీఎం3 లాంచ్‌ వెహికల్‌ క్రయోజనిక్‌ దశలో దీనిని వాడనున్నారు.

‘‘మిషన్‌ గగన్‌యాన్‌: ఇస్రోకు చెందిన సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ గగన్‌యాన్‌లో మానవ ప్రయాణానికి అనువైనదిగా రుజువైంది. ఇది కఠిన పరీక్షలను ఎదుర్కొంది. ఇక మానవ రహిత యాత్రకు వినియోగించే ఎల్‌వీఎం3 జీ1కు వాడే వాటి ప్రమాణ పరీక్షలు పూర్తయ్యాయి’’ అని పేర్కొంది. 

రాకెట్‌ ఇంజిన్లలో హ్యూమన్‌ రేటింగ్‌ అనేది కీలకం. ఇది  మనుషులు సురక్షితంగా ప్రయాణించేందుకు ఆ యంత్రాలు ఏ మేరకు సరిపోతాయో అంచనావేసే వ్యవస్థ. తాజాగా గగన్‌యాన్‌కు సంబంధించిన వాటిని చివరి సారిగా ఫిబ్రవరి 13వ తేదీన ఏడో సారి పరీక్షించారు. మహేంద్రగిరిలోని ఇస్రోలోని హైఆల్టిట్యూడ్‌ టెస్ట్ కేంద్రంలో ఇది జరిగింది. మొత్తం నాలుగింటిని 39 సార్లు మండించి వాటి పనితీరును అంచనావేశారు. ఇది దాదాపు 8,810 సెకన్ల పాటు జరిగింది. వాస్తవానికి ప్రమాణాల ప్రకారం 6,350 సెకన్లు నిర్వహిస్తే చాలు. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జరగనున్న  మానవ రహిత గగన్‌ యాన్‌ ప్రాజెక్టుకు అవసరమైన వాటికి యాక్సెప్టెన్సీ టెస్ట్‌లు కూడా పూర్తి చేసినట్లు ఇస్రో పేర్కొంది. 

14వేల మంది రైతులు..1200 ట్రాక్టర్లు: మళ్లీ మొదలుకానున్న ‘దిల్లీ చలో’

భారత్‌ ముగ్గురు వ్యోమగాములను దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలోకి చేర్చి.. తిరిగి వారిని భూమిపైకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం 3 రోజులపాటు జరగనుంది. వారు తిరుగు ప్రయాణంలో సముద్రంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని