Aditya L1: కీలక ఘట్టానికి ‘ఆదిత్య’.. జనవరి 6న ఎల్‌1 కక్ష్యలోకి!

‘ఆదిత్య ఎల్‌1’ను లగ్రాంజ్‌ పాయింట్‌1 కక్ష్యలోకి ప్రవేశపెట్టే విన్యాసాన్ని శనివారం నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు.

Published : 05 Jan 2024 20:20 IST

బెంగళూరు: సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య ఎల్‌1 (Aditya L1)’ తన ప్రయాణంలో తుది ఘట్టానికి చేరుకుంది. ఈ ఉపగ్రహాన్ని లగ్రాంజ్‌ పాయింట్‌1 (L1) కక్ష్యలోకి ప్రవేశపెట్టే కీలక విన్యాసాన్ని శనివారం నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఈ పాయింట్‌ ఉంది.

‘‘ఆదిత్య ఎల్‌1ను లగ్రాంజ్‌ పాయింట్‌1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టే విన్యాసాన్ని శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ చేపట్టని పక్షంలో.. ఆ ఉపగ్రహం సూర్యుడి దిశగా వెళ్లిపోయే ప్రమాదం ఉంది’’ అని ఓ ఇస్రో అధికారి ‘పీటీఐ’ వార్తా సంస్థకు తెలిపారు. జనవరి 6న దీనిని నిర్వహించే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ సైతం గతంలో వెల్లడించారు.

సూర్యుడిపై అధ్యయనం ఎందుకు? ఆదిత్య ఎల్‌1 ఏం చేస్తుంది?

సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ‘ఆదిత్య ఎల్‌1’ లక్ష్యం. భారత్‌ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్‌ ఇదే. గతేడాది సెప్టెంబరు 2న శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్‌ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు