ADITYA-L1: ఆదిత్యా వస్తున్నాం!
సూర్య చంద్రులు! మొదటి నుంచీ మనిషిని ఆకర్షిస్తున్న అంతరిక్ష వస్తువులివే. ఒకటేమో మనకు నక్షత్రం. భూమితో పాటు గ్రహాలన్నింటినీ తన చుట్టూ తిప్పుకొంటూ, సమస్త ప్రాణికోటికి జీవశక్తిని ప్రసాదిస్తోంది. మరోటేమో ఉపగ్రహం.
సూర్య చంద్రులు! మొదటి నుంచీ మనిషిని ఆకర్షిస్తున్న అంతరిక్ష వస్తువులివే. ఒకటేమో మనకు నక్షత్రం. భూమితో పాటు గ్రహాలన్నింటినీ తన చుట్టూ తిప్పుకొంటూ, సమస్త ప్రాణికోటికి జీవశక్తిని ప్రసాదిస్తోంది. మరోటేమో ఉపగ్రహం. మన భూమి చుట్టూ తిరుగుతూ, దీన్ని మరింత ఆవాసయోగ్యంగా మార్చి, స్థిరమైన వాతావరణానికి దన్నుగా నిలుస్తున్న సోదరుడు. అందుకే మనల్ని తిప్పుకొనే, మన చుట్టూ తిరిగే సూర్య చంద్రులంటే అంత ఆసక్తి. ఇటీవలి చంద్రయాన్-3 విజయ స్ఫూర్తితో మనదేశం ఇప్పుడు సూర్యుడిపైనా దృష్టి సారించింది. మరో మూడు రోజుల్లోనే అక్కడికి ఆదిత్య ఎల్-1 వ్యోమనౌకను ప్రయోగించనుంది.
మరి దీని ఉద్దేశం, లక్ష్యాలు, ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం.
సూర్యుడు, ఆదిత్యుడు, ప్రభాకరుడు, దినకరుడు.. ఇలా సూర్యుడిని ఎన్ని పేర్లతో పిలుచుకుంటామో. పురాణ కథల దగ్గరి నుంచి జ్యోతిష శాస్త్రం వరకూ సూర్యుడిని పదే పదే తలచుకుంటాం. ఆధునిక సైన్స్ ఓ నక్షత్రంగా గుర్తించి, గ్రహాలన్నింటికీ ఆధారమని చెప్పక ముందు నుంచే మనం సూర్యుడిని కొలుస్తూ వస్తున్నాం. కాబట్టే అతడికి సంబంధించిన ఏ విషయమైనా మనకు ఆసక్తి కలిగిస్తుంది. తాజాగా ఇస్రో చేపడుతున్న ఆదిత్య ఎల్-1 ప్రయోగమూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్-3 విజయం నేపథ్యంలో ఇది మరింత ఉత్సుకతనూ కలిగిస్తోంది. సూర్య అధ్యయనం కోసం మనదేశం ప్రయోగిస్తున్న మొట్టమొదటి వ్యోమనౌక ఆదిత్య ఎల్-1. ఇదొక అంతరిక్ష వేధ శాల (అబ్జర్వేటరీ). శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి, పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ సీ57 రాకెట్ ద్వారా ఇది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లనుంది. అలా 109 రోజుల ప్రయాణం అనంతరం సూర్యుడికి, భూమికి మధ్యలో ఎల్1 పాయింట్ వద్దకు చేరుకుంటుంది. ఈ క్రమంలో భూమి గురుత్వాకర్షణ ప్రాంతం ప్రభావం (ఎస్‌ఓఐ) నుంచి బయటపడి, చివరికి ఎల్1 చుట్టూరా ఉండే భారీ పరివేష కక్ష్యలోకి చేరుకుంటుంది. అక్కడే ఎల్-1 పాయింట్ చుట్టూ 177.86 రోజులకు ఒకసారి ప్రదక్షణ చేస్తుంది.
అనాది ఆసక్తి
సూర్యుడు తన రేడియేషన్, వేడి, రేణువుల ప్రవాహం, అయస్కాంత క్షేత్రాలతో నిరంతరం మన భూమిని ప్రభావితం చేస్తూనే ఉంటాడు. అతడి శక్తిని అర్థం చేసుకోవటానికి శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. మనదేశమూ తక్కువేమీ కాదు. సౌర పరిశోధన, సౌర ఫిజిక్స్‌లో మనదేశం చరిత్ర చాలా గొప్పది. సూర్యుడిలో హైడ్రోజన్ తర్వాత అత్యంత భారీ మూలకమైన హీలియంను గుర్తించింది మనదేశంలోనే. అదీ మన తెలుగు గడ్డ మీదే. జూల్స్ జాన్సెన్ అనే ఫ్రెంచి శాస్త్రవేత్త 1868లో, ఆగస్టు 18న సూర్య గ్రహణం సందర్భంగా గుంటూరులో దీన్ని కనుగొన్నారు. మనదేశంలో సూర్యుడు, మన వాతావరణం మీద సూర్యుడి ప్రభావాలను అధ్యయనం చేయటానికి కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఇది 1901 నుంచీ సూర్యుడిని పరిశీలిస్తూనే ఉంది. ప్రపంచంలో సుదీర్ఘకాల సోలార్ అబ్జర్వేటరీగా శతాబ్దానికి పైగా సేవలు అందిస్తూ వస్తోంది. సూర్యుడి మీద నిర్వహించే సుదీర్ఘ అధ్యయనాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. సూర్యుడి మచ్చలతో ముడిపడిన ప్రఖ్యాత ఎవర్‌షెడ్ ప్రభావాన్ని గుర్తించింది దీనిలోనే. ఉదయ్‌పుర్‌లో ఒక సరస్సు మధ్యలో 1970లో మరో సోలార్ అబ్జర్వేటరీనీ నెలకొల్పారు. లద్ధాఖ్‌లో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్ నిర్మాణానికీ ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుతం మనదేశంలో ఉన్న సౌర టెలిస్కోపుల కన్నా ఇది మరింత అధునాతనమైంది. తాజా ఆదిత్య ఎల్-1 ప్రయోగం ఈ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది.
అంతరిక్షం నుంచి ఎందుకు?
మనం ఇప్పటివరకూ భూమ్మీద నుంచే సూర్యుడిపై అధ్యయనాలు చేస్తూ వస్తున్నాం. ఎల్-1 ద్వారా ఇప్పుడు అంతరిక్షంలోంచి అధ్యయనానికి ఉపక్రమిస్తున్నాం. ఇంతకీ దీని అవసరం ఏంటి? భూమి వాతావరణం అంతరిక్షంలోకి వచ్చే రేడియేషన్‌ను చాలావరకు అడ్డుకుంటుంది. ఇది సూర్యుడి రేడియేషన్‌నూ నిలువరిస్తుంది. గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, అతి నీలలోహిత, అతి పరారారుణ రేడియేషన్‌ను వాతావరణం అడ్డుకుంటుంది. కేవలం రేడియో, దృశ్య కిరణాలు.. పరారుణ రేడియేషన్‌లో కొంత భాగమే భూమి మీదికి ప్రసరిస్తాయి. అతి నీలలోహిత కాంతి క్యాన్సర్ వంటి జబ్బులకు కారణమవుతుంది. కాబట్టి దీన్ని ఓజోన్ పొర అడ్డుకోవటం మనకు మేలే. కానీ సూర్యుడిని సవివరంగా అధ్యయనం చేయాలంటే అన్నిరకాల విద్యుదయస్కాంత తరంగదైర్ఘ్యాలు కావాలి. ముఖ్యంగా అతి నీలలోహిత కాంతి అత్యవసరం. ఇక్కడే ఆదిత్య ఎల్-1 వంటి సోలార్ అబ్జర్వేటరీలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇది అంతరిక్షంలోంచి సూర్యుడి అన్ని తరంగ దైర్ఘ్యాలను పరిశీలిస్తుంది. ఇలా నిరంతరం పరిశీలించటం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. పగలు, రాత్రి, ఆకాశం మబ్బులు పట్టటం వంటి వాటితో భూమి నుంచి నిరంతర అధ్యయనం సాధ్యం కాదు. అలాగే సౌర గాలి రేణువులు, అయస్కాంత క్షేత్రం సూర్యుడి నుంచి అంతర గ్రహ వ్యవస్థ ద్వారా ఎలా ప్రయాణిస్తుందో తెలుసుకోవాలంటే భూమి అయస్కాంత క్షేత్ర ప్రభావం పడని చోటు నుంచే పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకు ఆదిత్య ఎల్1 తోడ్పడుతుంది.
సూర్యుడిపై అధ్యయనం ఎందుకు?
అసలు సూర్యుడిపై అధ్యయనం ఎందుకు? చాలామందిలో తలెత్తే ప్రశ్న ఇది. మనకు అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం సూర్యుడే. అందువల్ల ఇతర నక్షత్రాలతో పోలిస్తే పూర్తిస్థాయిలో అధ్యయనం చేయటానికి భానుడే అనువుగా ఉంటాడు. సూర్యుడి లోతుపాతులను తెలుసుకుంటే విశ్వంలోని ఇతర నక్షత్రాలను అర్థం చేసుకోవటం తేలికవుతుంది. సూర్యుడు అత్యంత గతిశీల నక్షత్రం. అతడి ప్రభావం మనకు కనిపించే దాని కన్నా చాలా దూరం విస్తరిస్తుంది. అక్కడ బోలెడన్ని విస్ఫోటాలు, సౌర తుపాన్లు సంభవిస్తుంటాయి. అనంతమైన శక్తి పుట్టుకొస్తుంటుంది. ఇది మన వైపు వస్తే భూమి సమీపంలోని వాతావరణంలో రకరకాల మార్పులు సంభవిస్తాయి. సౌర తుపాన్ల ప్రభావంతో కొన్నిసార్లు ఉపగ్రహాలు దెబ్బతినటం చూస్తూనే ఉన్నాం. వీటిని ముందుగానే గుర్తిస్తే అనర్థాలను తప్పించుకోవచ్చు.
- మన పాలపుంతలో ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే ఆవాసయోగ్య గ్రహాలను గుర్తించటానికీ సౌర-భూమి వ్యవస్థ చాలా కీలకం. మ్యాగ్నెటోహైడ్రోడైనమిక్స్, అణు, ప్లాస్మా ఫిజిక్స్ రంగాల్లో సౌర అధ్యయనాలు పెద్ద భూమిక పోషిస్తాయి కూడా. ఇటీవల అమెరికా నియంత్రిత ఫ్యూజన్ రియాక్షన్ పద్ధతిలో శక్తిని సృష్టించటంలో విజయం సాధించింది. సూర్యుడి నుంచి నిరంతరం శక్తి విడుదల కావటానికి ఫ్యూజన్ ప్రక్రియే కారణం.
ఆదిత్య ఎల్1 ఏం చేస్తుంది?
మనదేశం ఎల్1 కేంద్రం వద్దకు ప్రయోగించనున్న మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం ఇదే. ఇందులో మొత్తం 7 శాస్త్ర పరికరాలుంటాయి. వీటిని రిమోట్ సెన్సింగ్, ఇన్-సిటు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. రిమోట్ సెన్సింగ్ పరికరాలు సూర్యుడి దృశ్యాలను, స్ప్రెక్టమ్‌ను చిత్రీకరిస్తాయి. ఇక ఇన్-సిటు పరికరాలేమో ఎల్1 గుండా అయస్కాంత క్షేత్రాలు, సౌర వాయు రేణువుల చర్యలను నేరుగా పసిగడతాయి. ఈ పరికరాలను ఇస్రో, ఐఐఏ బెంగళూరు, ఏయూసీఏఏ పుణే, పీఆర్‌ఎల్ అహ్మదాబాద్ రూపొందించాయి. సూర్యుడి మీది వాతావరణం (క్రోమోస్ఫేర్, కొరోనా) తీరుతెన్నులు.. సూర్యుడి ఉపరితలం కన్నా కొరోనా వేడిగా ఉండటం.. కొరొనా నుంచి పెద్దఎత్తున అయస్కాంత క్షేత్రం ఎగిసి పడటం.. సౌర జ్వాలలు.. సౌర గాలిలోని రేణువులు.. అంతరిక్ష వాతావరణం వంటి వాటిని ఆదిత్య ఎల్1 శోధిస్తుంది.
లెగ్రాంజ్ పాయింట్‌కే ఎందుకు?
ద్వి గురుత్వాకర్షణ వ్యవస్థలో లెగ్రాంజ్ పాయింట్‌కు ప్రత్యేక స్థానముంది. ఇదొక ఊహాత్మక కేంద్రం. ఇక్కడ రెండు వస్తువుల గురుత్వాకర్షణ బలం సమానంగా ఉంటుంది. అందువల్ల అక్కడ చిన్న వస్తువు స్థిరంగా ఉండగలుగుతుంది. సౌర, భూమి వ్యవస్థలో ఐదు లెగ్రాంజ్ పాయింట్లను గుర్తించారు. వీటిని ఎల్1, ఎల్2, ఎల్3, ఎల్4, ఎల్5 పేర్లతో పిలుచు కుంటారు. ఆదిత్య వ్యోమనౌక స్థిరపడేది ఎల్1 కేంద్రంలోనే. అందుకే ఆ పేరు పెట్టారు. ఇక్కడ భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. ఈ కేంద్రం భూమితో పాటు సూర్యుడి చుట్టూ ఆవరించి ఉంటుంది. కాబట్టి సౌర పరిశీలనకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇక్కడి నుంచి ఉపగ్రహాలు నిరంతరం సూర్యుడిని కనిపెట్టుకోవటానికి వీలుంటుంది. ఆదిత్య ఎల్1 ఈ కేంద్రం నుంచే సూర్యుడిపై అధ్యయనాలు చేస్తుంది. భూమి మీది లాగా అక్కడ వాతావరణం, గాలి ప్రవాహాల వంటి ప్రభావాలేవీ ఉండవు. మరింత స్పష్టంగా, నిశితంగా సూర్యుడిని వీక్షించటం సాధ్యమవుతుంది.
పరికరాల ప్రత్యేకత
- విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రఫీ (వీఈఎల్‌సీ): ఇది దృశ్యాలను చిత్రీకరించటంతో పాటు స్పెక్ట్రమ్‌నూ రూపొందిస్తుంది. ఇది సూర్యుడి చుట్టూ 1.05 రేడియై నుంచి 3 రేడియై వరకు ఉన్న కొరానాను అధ్యయనం చేయటానికి తోడ్పడుతుంది. సూర్యుడి వెలుగును అడ్డుకొని, చుట్టూ ఉండే కొరానా దృశ్యాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇది ఆదిత్య ఎల్1కే ప్రత్యేకం. సూర్యుడి నుంచి వెలువడే అయస్కాంత క్షేత్రం పుట్టుకను శోధించటంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
- సోలార్ అల్ట్రావయొలెట్ ఇమేజింగ్ టెలీస్కోప్ (సూట్): విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్‌కు చెందిన అతినీలలోహత ప్రాంతంలో దృశ్యాలను సేకరిస్తుంది. ఉపరితలం నుంచి ఆయా ఎత్తుల్లో సూర్యుడు ఎలా ఉంటాడో అనేది వివిధ కోణాల్లో చిత్రీకరిస్తుంది.
- సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్), హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (హీలియోస్): ఇవి సాఫ్ట్, హార్డ్ ఎక్స్‌రే పరికరాలు. సౌర జ్వాలల కీలక సమాచారాన్ని అందిస్తాయి.
- ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఆస్‌పెక్స్), ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య (పాపా): ఇవి ఇన్‌సిటు పరికరాలు. ఎల్1 కేంద్రం వద్ద సౌర గాలుల రేణువుల తీరుతెన్నులు, మిశ్రమాల మీద అధ్యయనం నిర్వహిస్తాయి.
- అడ్వాన్స్డ్ ట్రై-యాక్జియల్ హై రెజల్యూషన్ డిజిటల్ మాగ్నెటోమీటర్స్: ఇవీ ఇన్‌సిటు పరికరాలే. ఎల్1 కేంద్రం వద్ద అంతర్ గ్రహ ప్రాంతంలో అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తాయి.
- ఆదిత్య ఎల్1కు టెలిస్కోప్‌కు సూర్యుడి మీద ఆయా ప్రాంతాల్లో దృష్టిని కేంద్రీకరించే వినూత్న పరిజ్ఞానాన్నీ జోడించారు. హఠాత్తుగా చెలరేగే సీఎంఈలు, సౌర జ్వాలలు, తుపాన్ల వంటి వాటిని పసిగట్టటానికిది తోడ్పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ChatGPT: చాట్‌జీపీటీ ఇక వింటుందీ చూస్తుంది.. కొత్త ఫీచర్లు వారికి మాత్రమే!
-
CM Jagan: ‘ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి’.. కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశం
-
Nithya Menen: ‘నిత్యామేనన్‌కు తమిళ హీరో వేధింపులు’ స్పందించిన నటి!
-
Nitish Kumar: సచివాలయానికి వెళ్లిన సీఎం నీతీశ్‌కు షాక్!
-
World Cup: వన్డే ప్రపంచకప్ జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
-
Viral video : సింగపూర్‌లో 100 కేజీల బాంబు పేల్చివేత!