Ayodhya Ram Mandir: నవ భారత ప్రయాణానికి జనవరి 22న నాంది.. ‘అయోధ్య’పై చర్చలో అమిత్ షా

Ayodhya Ram Mandir: రామమందిర ప్రారంభోత్సవంతో నవ భారత ప్రయాణానికి నాంది పడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వేలాది సంవత్సరాల పాటు ‘జనవరి 22’ తేదీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

Published : 10 Feb 2024 15:39 IST

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం (Ayodhya Ram Mandir), బాలక్‌ రామ్‌ ప్రాణప్రతిష్ఠ వేడుకలపై లోక్‌సభలో శనివారం చర్చ చేపట్టారు. ఈసందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ.. శ్రీరాముడు లేని భారత్‌ను ఊహించుకోలేమన్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22వ తేదీ వేల సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.

‘‘రామమందిర ఉద్యమం లేకుండా ఈ దేశంలో ఏ ఒక్కరూ చరిత్రను చదవలేరు. 1528 నుంచి ప్రతి తరం ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమాన్ని చూసింది. ఐదు శతాబ్దాల పాటు జరిగిన ఈ సుదీర్ఘ పోరాటానికి తెర పడింది. అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లౌకికవాదాన్ని చాటిచెప్పింది. దేశం కలలుగన్న అయోధ్య ఆలయం మోదీ (PM Modi) ప్రభుత్వ హయాంలో సాకారమైంది. ప్రాణప్రతిష్ఠ సమయంలో ప్రధాని 11 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష చేపట్టారు’’ అని కేంద్రమంత్రి తెలిపారు.

370 సీట్లు పక్కా.. ఎన్నికలకు ముందే సీఏఏ: అమిత్‌ షా

ఈసందర్భంగా ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘‘జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ.. నవ భారత ప్రయాణానికి నాంది. శ్రీరాముడి లేని భారతాన్ని ఊహించుకునేవారికి మన దేశం గురించి పూర్తిగా తెలియదు. వారు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) ఇంకా వలసవాద రోజుల్లోనే ఉన్నారు. చరిత్ర గురించి తెలుసుకోని వారికి ఎలాంటి గుర్తింపు ఉండదు’’ అని అమిత్ షా అన్నారు. అయోధ్యలో నిర్మించిన ఎయిర్‌పోర్టుకు శ్రీరాముడి పేరు పెట్టాలని చాలా ప్రతిపాదనలు వచ్చాయని ఆయన తెలిపారు. కానీ, ప్రధాని మాత్రం మహర్షి వాల్మీకి పేరును సూచించారని, సమాజంలో అన్నివర్గాల వారికి సముచిత స్థానం కల్పించేందుకు ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని