Kerala govt: ఇకపై పాఠశాలల్లో వాటర్‌ బ్రేక్‌.. కేరళ ప్రభుత్వం నిర్ణయం

రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో కేరళ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. 

Updated : 17 Feb 2024 20:41 IST

తిరువనంతపురం: రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో కేరళ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో విద్యార్థులకు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చినట్లుగా వాటర్‌ బ్రేక్‌ ఇవ్వనుంది. వేసవిలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురవకుండా ఉండడానికి, తగినంత నీరు తాగేలా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాలల్లో "వాటర్-బెల్" విధానాన్ని అమలుచేయాలని యోచిస్తోంది.

 2019లో దేశంలో మొదటిసారి ఈ విధానాన్ని కేరళలోని కొన్ని బడుల్లో ప్రారంభించామని  రాష్ట్ర విద్యాశాఖ మంత్రిత్వ కార్యాలయం తెలిపింది. అనంతరం ఈ విధానాన్ని కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం అమలుచేశాయని పేర్కొంది. దీనిని పరిగణలోకి తీసుకొని ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో అమలుచేస్తామంది.

ఇందులోభాగంగా పాఠశాలల్లో ఉదయం 10.30, మధ్యాహ్నం 2.30 గంటలకు ఐదు నిమిషాల పాటు విద్యార్థులకు నీరు తాగడానికి విరామం ఇవ్వనున్నారని తెలిపారు. ఇది పిల్లల్లో డీహైడ్రేషన్, ఇతర అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని వివరించారు.

ఇదిలాఉండగా, కేరళ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిర్వహణ అథారిటీ (కేఎస్‌డీఎంఏ) కన్నూరు, కొట్టాయం, కొయ్‌కోడ్‌, అలప్పుళ జిల్లాల్లో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతలను సూచిస్తూ హెచ్చరిక జారీ చేసింది. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని