Biryani: బిర్యానీ ఎర వేసి.. ప్రాణాలు కాపాడిన పోలీసులు

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తికి బిర్యానీ ఎర చూపిన పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కోల్‌కతా నగరంలో జరిగింది.

Updated : 23 Jan 2024 18:11 IST

కోల్‌కతా: ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడిన 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. బిర్యానీ ప్యాకెట్‌ను ఎరగా చూపి అతడిని పట్టుకున్నారు. కోల్‌కతా (Kolkata) నగరంలో అత్యంత రద్దీగా ఉండే సైన్స్‌ సిటీ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. దీంతో దాదాపు అరగంటపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా నివసిస్తున్న ఓ వ్యక్తి వ్యాపారంలో బాగా నష్టపోయాడు. భార్య కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. వివిధ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు.. సోమవారం మధ్యాహ్నం తన కుమార్తెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని సైన్స్‌ సిటీ వైపు వచ్చాడు. ఫోన్‌ ఎక్కడో జారిపోయిందని, వెతికి తీసుకొస్తానని చెప్పి, ఆమెను రోడ్డు పక్కనే నిలబెట్టి.. దగ్గర్లో ఉన్న వంతెన పైకి ఎక్కేశాడు. అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. 

దీన్ని గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే స్పందించిన కోల్‌కతా పోలీస్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌ (డీఎంజీ), అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని కిందకు దిగాల్సిందిగా కోరారు. అతడి మానసిక స్థితి గురించి కుమార్తెను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి.. ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చినా దిగకపోవడంతో.. ఓ బిర్యానీ ప్యాకెట్‌ చూపించారు. అది చూడగానే అతడు కిందకు రావడంతో, అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం కౌన్సెలింగ్‌ ఇస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒక వేళ దూకి ఉంటే.. వంతెన కిందనున్న రైల్వే ట్రాక్‌పై పడిపోయేవాడని, లేదంటే వంతెనకు అమర్చిన ఇనుప రాడ్లు తగిలి ప్రాణాలు కోల్పోయి ఉండేవాడని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని