Shivaji Row: ‘శివాజీ’ వివాదం.. మహా గవర్నర్‌కు అమృతా ఫడణవీస్‌ మద్దతు

మహారాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీకి మరాఠీలంటే ఎంతో ప్రేమ అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత వ్యాఖ్యానించారు.

Published : 26 Nov 2022 01:41 IST

ముంబయి: ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్ కోశ్యారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృతా ఫడణవీస్‌ గవర్నర్‌కు మద్దతుగా నిలిచారు. కోశ్యారీకి మరాఠీలంటే ఎంతో ప్రేమ అని అమృత వ్యాఖ్యానించారు.

‘‘గవర్నర్‌ కోశ్యారీ గురించి వ్యక్తిగతంగా నాకు తెలుసు. మహారాష్ట్రకు వచ్చిన తర్వాత ఆయన మరాఠీ నేర్చుకున్నారు. మరాఠీలంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఇది నేను దగ్గరుండి గమనించా. అయితే గతంలోనూ చాలా సార్లు ఇలా జరిగింది. ఆయన చెప్పిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆయన మనసు నిండా మరాఠీ మనిషే’’ అని విలేకరులతో మాట్లాడుతూ అమృతా ఫడణవీస్‌ అన్నారు. శివాజీని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కోశ్యారీని గవర్నర్‌ పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్లు చేస్తోన్న వేళ.. అమృత ఆయనకు మద్దతుగా నిలవడం ఏక్‌నాథ్‌ శిందే-భాజపా సర్కారును మరింత ఇరుకున పడేసినట్లయింది.

ఇటీవల ఓ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్‌ కోశ్యారీ.. ఛత్రపతి శివాజీ పాతకాలపు నాయకుడని వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కోశ్యారీ వ్యాఖ్యలను శివసేన తీవ్రంగా ఖండించింది. ఆయనకు కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సహా పలువురు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని