Maldives Row: లక్షద్వీప్‌ వివరాల కోసం సెర్చ్‌.. ఆన్‌లైన్‌ శోధన 20ఏళ్లలో గరిష్ఠం!

మోదీ పర్యటన తర్వాత లక్షదీవుల సమాచారం కోసం ఆన్‌లైన్‌ శోధిస్తున్న వారి సంఖ్య ఇరవై ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగాలు వెల్లడించాయి.

Updated : 11 Jan 2024 13:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ (Modi in Lakshadweep) పర్యటన అనంతరం ప్రపంచ పర్యాటకుల చూపు భారత దీవులపై పడింది. వీటికోసం ఆన్‌లైన్‌లో భారీ ఎత్తున (Google Trends) శోధిస్తున్నట్లు వెల్లడైంది. మోదీ పర్యటన తర్వాత ఈ దీవుల కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్న వారి సంఖ్య ఇరవై ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగాలు వెల్లడించాయి. మరోవైపు తమ వెబ్‌సైట్‌లో లక్షద్వీప్‌ కోసం వెతుకుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ మేక్‌మైట్రిప్‌ (MakeMyTrip) వెల్లడించింది.

ప్రధాని మోదీ (Narendra Modi) జనవరి మొదటి వారంలో లక్షద్వీప్‌లో పర్యటించారు. కవరత్తి దీవిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతోపాటు ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఓ బీచ్‌లో ప్రధాని మోదీ కొన్ని గంటలపాటు సేద తీరారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ప్రధాని మోదీ.. లక్షద్వీప్‌లో బీచ్‌లు, ఆతిథ్యం అద్భుతంగా ఉందన్నారు. సాహసాలు చేయాలనుకునేవారు.. లక్షద్వీప్‌ను కూడా జాబితాలో చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో ఆన్‌లైన్‌లో లక్షద్వీప్‌ కోసం శోధించేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కేవలం శుక్రవారం రోజే 50వేల మంది (Lakshadweep) గూగుల్‌లో వెతికినట్లు అంచనా. ఇలా మోదీ పర్యటన తర్వాత భారత దీవుల కోసం శోధించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని.. 20ఏళ్లలో ఇదే గరిష్ఠమని కేంద్ర ప్రభుత్వ డిజిటల్‌ విభాగం (MyGovIndia)తోపాటు ఆల్‌ఇండియా రేడియో, డీడీ న్యూస్‌లు వెల్లడించాయి.

మేక్‌మైట్రిప్‌లోనూ హవా..

‘లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటన తర్వాత తమ ఆన్‌లైన్‌ వేదికలో భారత దీవుల కోసం వెతికే వారి సంఖ్య 3400శాతం పెరిగింది. భారత్‌ బీచ్‌లపై పర్యాటకులు చూపిస్తోన్న ఆసక్తి.. కొత్త కార్యక్రమాలు (Beaches of India) రూపొందించేందుకు స్ఫూర్తినిచ్చింది. అద్భుతమైన బీచ్‌లను అన్వేషించేలా భారత పర్యాటకులను ప్రోత్సహించేందుకు సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లను త్వరలోనే అందిస్తాం’ అని ‘ఎక్స్‌’ వేదికగా మేక్‌మైట్రిప్‌ వెల్లడించింది. దీనికి ప్రతిస్పందిస్తున్న నెటిజన్లు.. మాల్దీవులకు పర్యాటక బుకింగ్స్‌ నిలిపివేయాలని సూచించడం గమనార్హం.

లక్షద్వీప్‌లో మోదీ సాహసం

లక్షద్వీప్‌లో పర్యటన సందర్భంగా స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో లక్షద్వీప్‌లో పరిశుభ్రతను ఉద్దేశిస్తూ మాల్దీవుల (Maldives) మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దిద్దుబాటు చర్యలు చేపట్టిన అక్కడి ప్రభుత్వం.. అనుచిత వ్యాఖ్యలతో సంబంధమున్న ముగ్గురు మంత్రులను తొలగించినట్లు ప్రకటించింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు దీటుగా స్పందిస్తోన్న భారత సినీ, క్రీడారంగ ప్రముఖులు.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా భారత్‌ దీవులను (Lakshadweep) అన్వేషించాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని