టాయిలెట్ కోసం వందేభారత్‌ ఎక్కి.. ₹ 6 వేలు నష్టపోయాడు

టాయిలెట్‌ కోసం ఫ్లాట్‌ఫామ్‌పై ఆగిన వందేభారత్‌ (Vande Bharat) రైలు ఎక్కిన ఓ వ్యక్తి.. ట్రైన్‌ కదలడంతో లోపలే ఇరుక్కుపోయాడు. దీంతో చేసేదేంలేక ఫైన్ చెల్లించి తర్వాతి స్టేషన్‌లో దిగిపోయాడు.

Published : 20 Jul 2023 16:14 IST

భోపాల్: కొద్దిరోజుల క్రితం వందేభారత్‌ (Vande Bharat) రైలు ఎలా ఉందో చూద్దామని ఎక్కిన వ్యక్తి అందులోని ఆధునిక భద్రతా వ్యవస్థతో కూడిన డోర్లు మూసుకుపోవడంతో రైలు లోపలే ఉండిపోయాడు. రైలు ఆపాలని సిబ్బందిని బతిమిలాడినా.. ప్రయోజనం లేకపోవడంతో ఫైన్‌ చెల్లించి తర్వాతి స్టేషన్‌లో దిగిపోయాడు. సరిగ్గా ఈ తరహా ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. టాయిలెట్‌ కోసం ఫ్లాట్‌ఫామ్‌పై ఆగిన వందేభారత్‌ ఎక్కిన ఓ వ్యక్తి.. రైలు కదలడంతో ఫైన్‌ చెల్లించడంతోపాటు అదనంగా మరో రూ. ఐదు వేలు నష్టపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని సింగ్రౌలీ (Singrauli)కి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా హైదరాబాద్‌ నుంచి భోపాల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. భోపాల్‌ నుంచి సింగ్రౌలీ వెళ్లేందుకు మరో రైలు కోసం ఫ్లాట్‌ఫామ్‌పై వేచి చూస్తున్నాడు. అదేసమయంలో మూత్ర విసర్జన కోసం అప్పుడే ఫ్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన వందేభారత్‌ రైలులోకి వెళ్లాడు. టాయిలెట్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైలు దిగిపోయేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ట్రైన్‌ తలుపులు మూసుకోవడంతో లోపలే ఉండిపోయాడు. తర్వాత రైలు కదలడంతో టీటీఈని సంప్రదించాడు. రైలు ఉజ్జయిని స్టేషన్‌లో ఆగుతుందని టీటీఈ చెప్పడంతో.. చేసేదేంలేక లోపలే ఉండిపోయాడు. టికెట్‌ లేకుండా రైలు ఎక్కినందుకు రూ. 1,020 ఫైన్ చెల్లించాడు. తర్వాత రైలు ఉజ్జయిని స్టేషన్‌లో ఆగడంతో అక్కడ దిగిపోయాడు. 

ఈ క్రమంలో తన కుటుంబం భోపాల్‌ స్టేషన్‌లోనే ఉండిపోవడంతో.. ఉజ్జయిని నుంచి బస్‌ టికెట్‌కు రూ. 750 చెల్లించి భోపాల్ చేరుకున్నాడు. అప్పటికే.. వారు సింగ్రౌలీ వెళ్లేందుకు రూ. 4 వేలు చెల్లించి టికెట్లు బుక్‌ చేసుకున్న రైలు వెళ్లిపోయింది. దీంతో, మొత్తంగా సుమారు రూ. 6 వేలు నష్టపోయినట్లు తెలిపాడు. ఈ ఘటనపై భోపాల్‌ స్టేషన్‌ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. వందే భారత్‌ రైలు కదిలే ముందుగా తలుపులు ఏ వైపు తెరుచుకుంటాయి, ఎటువైపు లాక్‌ చేసి ఉంటాయనేది ప్రయాణికులకు తెలిసేలా ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేశారు. రైలు కదిలే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రయాణికుల భద్రత కోసమే ఆధునిక డోర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు