NEET: నీట్ ర్యాంకు రాలేదని విద్యార్థి ఆత్మహత్య.. ఆ మరుసటి రోజే ఉరేసుకున్న తండ్రి..!

తమిళనాడు ప్రభుత్వం నీట్‌(NEET)ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నీట్‌లో ర్యాంకు సాధించలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

Published : 14 Aug 2023 13:15 IST

చెన్నై: రెండుసార్లు ప్రయత్నించినా నీట్‌(NEET)లో ర్యాంకు రాలేదని ఓ విద్యార్థి బలన్మరణానికి పాల్పడ్డాడు. చేతికి అందొచ్చిన కుమారుడి మరణవార్త విని, తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి ఆ మరుసటి రోజే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు(Tamil Nadu) రాజధాని చెన్నై పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 

జగదీశ్వరన్‌ 2022లో 12వ తరగతి పూర్తి చేశాడు. ఈ క్రమంలో వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌(NEET)కు శిక్షణ తీసుకున్నాడు. అయితే రెండు ప్రయత్నాల్లో అతడు ఆశించిన ఫలితం పొందలేకపోయాడు. దాంతో మనస్తాపానికి గురైన జగదీశ్వరన్‌.. శనివారం ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి సెల్వశేకర్‌ మరుసటి రోజు ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆలయంపై పడిన కొండచరియలు: 9 మంది మృతి.. శిథిలాల కింద మరో 20 మంది!

ఆత్మహత్యలు వద్దు.. నీట్‌ రద్దవుతుంది: ఎంకే స్టాలిన్‌

ఈ విషాద ఘటనలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(MK Stalin) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు వెళ్లాలని కోరారు. అలాగే కొన్ని నెలల్లో రాజకీయంగా మార్పులు వస్తే.. నీట్ అడ్డంకులు తొలగిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ‘నేను సంతకం చేయను’ అనేవారు అదృశ్యమవుతారని గవర్నర్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ‘జగదీశ్వరన్‌ మృతితో సెల్వశేకర్ ప్రాణాలు తీసుకున్నారు. వారి కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. చదువుల్లో చురుగ్గా ఉండే తమ కుమారుడిని వైద్యుడిగా చూడాలని జగదీశ్వరన్ తల్లిదండ్రులు భావించారు. కానీ నీట్ బలిపీఠంపై ప్రాణాలు కోల్పోయిన వారి జాబితాలో అతడు చేరాడు. ఇది అత్యంత దారుణమైన ఘటన’ అని స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని