Viral news: ఇదేంటి భయ్యా.. టెక్నాలజీని ఇలా ఉపయోగిస్తే ఎలా?

వేగంగా కదులుతున్న కారులో కొందరు యువకులు జూదం ఆడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఏడీఏఎస్‌ టెక్నాలజీని యువకులు దుర్వినియోగం చేస్తున్నారని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Published : 12 Dec 2022 01:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్నాలజీ(Technology)ని సరైన మార్గంలో ఉపయోగిస్తే సరేసరి.. లేదంటే దానివల్ల అనర్థాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగని పూర్తిగా టెక్నాలజీపైనే ఆధారపడినా ప్రమాదమేనని అంటున్నారు. టెక్నాలజీని ఎలా వాడుకోకూడదో చెప్పడానికి కొందరు యువకులు చేసిన ఈ పనే చక్కని ఉదాహరణ. మహీంద్రా సంస్థ తీసుకొచ్చిన ఎక్స్‌యూవీ 700(XUV 700) మోడల్‌ కారులో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌ (ఏడీఏఎస్‌) టెక్నాలజీని ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఇది డ్రైవర్‌కు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉంటుంది. అనుకోకుండా ఏదైనా అడ్డువస్తే వెంటనే డ్రైవర్‌ని అలర్ట్‌ చేస్తుంది. ఆటోడ్రైవింగ్‌ వెసులుబాటు కూడా ఈ కారులో ఉంది. దీనినే అదునుగా తీసుకున్న కొంతమంది యువకులు స్టీరింగ్‌ వదిలేసి కదులుతున్న కారులోనే జూదం ఆడటం మొదలు పెట్టారు. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, దీనికి సంబంధించిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘ ఎవరూ సీట్‌ బెల్టు పెట్టుకోలేదు. డ్రైవింగ్‌పై ఏకాగ్రత లేదు. ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. సంబంధిత అధికారులు వీరిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి’ అని ఒక యూజర్‌ కామెంట్‌ చెయ్యగా.. ఏడీఏఎస్‌ కేవలం ఒక టెక్నాలజీ మాత్రమేనని, అది ఒకవేళ కరెక్ట్‌గా పని చెయ్యకపోతే మీ జీవితాలు ఏమవుతాయో ఒక్కసారైనా ఆలోచించారా? అని మరో యూజర్‌ కామెంట్‌ చేశాడు. ‘ఆటో డ్రైవ్‌ అన్నిసార్లు పని చెయ్యకపోవచ్చు.. జాగ్రత్త బ్రదర్స్‌’ అంటూ మరొకరు ఇలా.. కామెంట్ల వర్షం గుప్పిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని