Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ రెండో కేసు.. కేంద్రం కీలక ఆదేశాలు

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ (Monkeypox) కేసులు మన దేశంలోనూ విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది........

Updated : 15 Aug 2022 13:41 IST

దిల్లీ: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ (Monkeypox) కేసులు మన దేశంలోనూ విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళలోని కన్నూరు జిల్లాలో తాజాగా రెండో కేసు వెలుగుచూసిన నేపథ్యంలో సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు హెల్త్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు మరింత కఠినంగా నిర్వహించాలని విమానాశ్రయాలు, ఓడరేవుల అధికారులకు ఆదేశించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విమానాశ్రయాలు, ఓడరేవుల ఆరోగ్య అధికారులు, ఆరోగ్యశాఖ రీజనల్‌ డైరెక్టర్లు హాజరయ్యారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో మంకీపాక్స్ వ్యాప్తిని కట్టడి చేసేలా అంతర్జాతీయ ప్రయాణికులందరికీ కఠిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చూడాలని సూచించినట్టు పేర్కొంది.

గత వారంలో యూఏఈ నుంచి వచ్చిన కేరళలోని కొల్లాంకు చెందిన వ్యక్తిలో తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించిన సంగతి తెలిసిందే. సదరు వ్యక్తి యూఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడంతో ఈ వైరస్‌ బారినపడ్డారు. అయితే, తాజాగా కన్నూరు జిల్లాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్‌ బయటపడటం గమనార్హం. ప్రస్తుతం అతడికి కన్నూరు జిల్లా పరియారం వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని.. ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిపై దృష్టిపెట్టినట్టు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. తాజాగా మంకీపాక్స్‌ బారిన పడిన వ్యక్తి జులై 13న దుబాయి నుంచి బయల్దేరి కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడంతో దక్షిణ కన్నడ జిల్లా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వ వెన్‌లాక్‌ ఆస్పత్రిలో 10 ప్రత్యేక పడకలను రిజర్వు చేసి ఉంచారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసూ నమోదు కాలేదని జిల్లా అధికారి డాక్టర్‌ జగదీశ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని