Kumaraswamy: ‘ఇది నాకు మూడో జన్మ.. అటువంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయొద్దు!’

అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి నేడు డిశ్ఛార్జి అయ్యారు. స్ట్రోక్‌ వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని ప్రజలకు సూచించారు.

Published : 03 Sep 2023 17:27 IST

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ ఎమ్మెల్యే కుమారస్వామి (Kumaraswamy) ఇటీవల అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. సకాలంలో ఆయన ఆస్పత్రిలో చేరడంతో ముప్పు తప్పిందని వైద్యులు ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలోనే కుమారస్వామి ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది తనకు మూడో జన్మ అని చెప్పారు. దేవుడికి, చికిత్స అందించిన వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు కొత్త జీవితాన్ని పొందినట్లు తెలిపారు. స్ట్రోక్‌ వంటి లక్షణాలు కనిపిస్తే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘ఈ రోజు మీతో మాట్లాడుతున్నానంటే.. నేను పునర్జన్మ పొందినట్లే చెప్పాలి. ఒక వ్యక్తికి ఒక జన్మ ఉంటే.. నా ఆరోగ్యం విషయంలో 64 ఏళ్ల వయసులో దేవుడు నాకు మూడో జన్మ ఇచ్చినట్లు భావిస్తున్నా’ అని కుమారస్వామి చెప్పారు. ఆస్పత్రిలో చేరిన రోజు జరిగిన పరిణామాలను గుర్తుచేసుకుంటూ.. ‘ఆ రోజు అర్ధరాత్రి 2 గంటలకు మెలకువ వచ్చింది. అనారోగ్యంగా ఉన్నట్లు గుర్తించా. పక్షవాతం లక్షణాలు కావచ్చని అనుమానం వచ్చింది. ఆలస్యం చేయకుండా.. వెంటనే వైద్యులను సంప్రదించా. వారి సలహాలతో ఆస్పత్రిలో చేరాను’ అని చెప్పారు.

‘జమిలి’ అంటే రాష్ట్రాలపై దాడి చేయడమే: రాహుల్‌ గాంధీ

స్ట్రోక్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దని ప్రజలకు కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ఆ రోజు తాను లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే.. జీవితాంతం మంచానికే పరిమితమయ్యేవాడినన్నారు. ఇదిలా ఉండగా.. కుమారస్వామి ఆగస్టు 30న తెల్లవారుజామున నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు స్ట్రోక్‌ వచ్చిందని, ఆ తర్వాత పూర్తిగా నయమైందని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని