Bihar Police: డ్యూటీలో ఫోన్ వాడితే చర్యలే..!

పోలీసులు మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగించడంపై బిహార్‌ పోలీసుశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉన్న సమయంలో పోలీసులు మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.

Published : 02 Jun 2021 22:02 IST

పోలీసులపై ఫిర్యాదుల నేపథ్యంలో బిహార్‌ డీజీపీ నిర్ణయం

పట్నా: పోలీసులు మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగించడంపై బిహార్‌ పోలీసుశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉన్న సమయంలో పోలీసులు మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉపయోగించకూడదని ఆదేశించింది. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే వీటికి మినహాయింపు ఇవ్వాలని పోలీస్‌శాఖ ఆదేశాలు జారీచేసింది. విధుల్లో ఉన్న సమయంలో పోలీసులు ఎక్కువగా మొబైల్‌ ఫోన్లలో లీనమైపోతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

‘డ్యూటీలో ఉన్న పోలీసులు స్మార్ట్‌ ఫోన్లలో మాట్లాడడం, బిజిగా ఉండడం, చాటింగ్‌లో లీనమైనట్లు గుర్తించాం. ఇదే వారి ప్రధాన విధులుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది’ అని అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో బిహార్‌ డీజీపీ ఎస్‌కే సింఘాల్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ సిగ్నళ్లు, వీఐపీ విధుల్లో ఉన్న సిబ్బంది, క్రౌడ్‌ కంట్రోలింగ్‌ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఎక్కువ కాలక్షేపం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో డ్యూటీలో ఉన్న పోలీసులు మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలంగా ఉండడం, వీఐపీ డ్యూటీలో ఉన్న సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటిని పోలీసు అధికారులు, సిబ్బంది ఎవరైనా అతిక్రమిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్లలో బిజీగా ఉంటున్నట్లు పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఇలాంటి ఆదేశాలను జారీచేస్తున్నాయి. రాజస్థాన్‌ ప్రభుత్వం 2019లో ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. డ్యూటీ సమయంలో పోలీసు సిబ్బంది మొబైల్‌ ఫోన్లను వారి ఉన్నతాధికారులకు అప్పజెప్పాల్సి పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని