Bombay High Court: ప్రస్తుతం విద్య అందుబాటులో లేనిదిగా మారింది: ముంబయి హైకోర్టు

భారతీయ సంస్కృతిలో విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని కాని ప్రస్తుతం అటువంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయిందని బాంబే హైకోర్టు పేర్కొంది. 

Updated : 04 Mar 2024 19:18 IST

ముంబయి: భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని, కానీ, ప్రస్తుతం అటువంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయిందని బాంబే హైకోర్టు (Bombay High Court) పేర్కొంది.  నాణ్యమైన విద్య అందరికీ అందేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని తెలిపింది.

పుణెలో విద్యాసంస్థల ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని కొట్టివేయలేమని న్యాయమూర్తులు ఏఎస్ చందూర్కర్, జితేంద్ర జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. హైకోర్టు ఫిబ్రవరి 21న ఇచ్చిన ఉత్తర్వుల్లో విద్యావిధాన విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోదని, ఉత్తమమైన విద్యాసంస్థలను ఎంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిర్ణయాలను ఏకపక్ష నిర్ణయంగా పరిగణించలేమన్నది. దశాబ్దాలుగా పుణె ‘ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్’గా ప్రసిద్ధి చెందిందని, విదేశీ విద్యార్థులు సైతం ఇక్కడ విద్యనభ్యసించడానికి వస్తుండటంతో విద్యాసంస్థలకు కేంద్రంగా మారిందని హైకోర్టు పేర్కొంది. దీంతో నగర శివారుల్లో కూడా విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంలో పోటీ నెలకొందని వివరించింది. పవిత్రమైన విద్య రానురాను అభ్యసించలేనిదిగా మారిందని విచారం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ నాణ్యమైన విద్య అందించేలా చూడడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా అభివర్ణించింది.

పుణెలో విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలనుకున్న తమకు కాకుండా, వేరే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో జాగృతి ఫౌండేషన్, సంజయ్ మోదక్ ఎడ్యుకేషన్‌లు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. నిబంధనలను ఉల్లంఘించినప్పుడు లేదా అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు మాత్రమే కోర్టు జోక్యం చేసుకుంటుందని ధర్మాసనం పేర్కొంది.

ప్రభుత్వం ఈ విధంగా అసంబద్ధమైన విషయాలను పరిగణనలోకి తీసుకొని అనుమతి నిరాకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషనర్‌లు ఈ రంగంలో కొత్తవారు కావడం, వారి ఆర్థిక పరిస్థితి అనుమతి మంజూరు చేసిన సంస్థల కంటే తక్కువగా ఉందనే కారణాలతో ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అన్ని పరిమితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నందున వారికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని అన్యాయంగా పరిగణించలేమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

‘ఏదైనా విద్యా సంస్థను నిర్వహించాలంటే స్థలం విలువ, ఆర్థిక పరిస్థితి, మౌలిక సదుపాయాలు మొదలైనవి కచ్చితంగా పరిగణించాల్సిన కీలకమైన అంశాలు’ అని హైకోర్టు పేర్కొంది. అటువంటి సామర్థ్యం ఒక సంస్థకు ఉందో, లేదో నిర్ణయించేటప్పుడు విద్యా సంస్థను నడిపిన అనుభవం చాలా ముఖ్యమైనదని కోర్టు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని