మానవ అక్రమరవాణా ఆరోపణలు.. చివరకు ముంబయి చేరుకున్న భారతీయులున్న విమానం

300 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న లెజెండ్‌ సంస్థకు చెందిన విమానాన్ని గతవారం ఫ్రాన్స్‌(France)లో నిలిపేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇది భారత్‌కు చేరుకుంది. 

Updated : 26 Dec 2023 18:33 IST

ముంబయి: ఫ్రాన్స్‌(France)లో నిలిపేసిన భారతీయ ప్రయాణికులున్న విమానం మంగళవారం ముంబయి( Mumbai)లో ల్యాండ్ అయింది. మానవ అక్రమ రవాణా( human trafficking) జరుగుతోందని వచ్చిన ఫిర్యాదులతో 300 మందికిపైగా ప్రయాణికులున్న విమానాన్ని విచారణ కోసం ఫ్రాన్స్‌లో ఆపిన సంగతి తెలిసిందే. నాలుగురోజుల పాటు ఫ్రాన్స్ అధికారుల అదుపులో ఉన్న ఈ విమానం సోమవారం అక్కడి నుంచి బయల్దేరి ఈ రోజు తెల్లవారుజామున ముంబయిలో దిగింది. ఈ విమానంలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. ఇద్దరు మైనర్లుసహా 25 మంది ఫ్రాన్స్‌ ఆశ్రయం కోరడంతో వారిని అక్కడే ఉంచారు.

యూఏఈ నుంచి నికరాగువా బయలుదేరిన రుమేనియాకు చెందిన లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఇంధనం కోసం వాట్రీ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఫ్రాన్స్ అధికారులు దానిని తమ అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో 11 మంది మైనర్ల వెంట తెలిసిన పెద్దవారు లేరని విచారణలో అధికారులు గుర్తించారు. అన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత విమానం ముంబయికి బయల్దేరేందుకు అనుమతి లభించింది. దీనిపై ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ విషయంలో అధికారులు త్వరితగతిన స్పందించారని వెల్లడించింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.

‘ముంబయి చేరిన వాణిజ్యనౌక ఎంవీ కెమ్‌ ప్లూటో’

తొలుత ఈ విమానాన్ని దుబాయ్‌కుగానీ.. నికరాగువాకుగానీ పంపాలని భావించారు. అయితే విమానంలో భారతీయులు ఎక్కువగా ఉండటంతో చివరకు ముంబయికి పంపాలని నిర్ణయించారు. వారిలో పంజాబ్‌, గుజరాత్‌కు చెందిన పేద ప్రజలు ఉన్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించాలనే ప్రణాళికలో భాగంగా ఆ ప్రయాణికులంతా నికరాగువా(Nicaragua)కు వెళ్తున్నట్లు తెలిపాయి.

మీడియాకు దూరంగా పరుగులు..

ముంబయిలో దిగిన వెంటనే ప్రయాణికులపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో వారు మీడియా దృష్టి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. ‘ఫ్రాన్స్‌ నుంచి ఎవరూ రావడం లేదు సర్’ అని వెల్లడించిన ఓ ప్రయాణికుడు తర్వాత అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. మరో వ్యక్తి తాను ఫ్రాన్స్‌ నుంచే వచ్చినట్లు అంగీకరించినా.. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని