Bhagwant Mann: రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్‌ మాన్‌!

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. గురువారం ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నారు. .......

Updated : 06 Jul 2022 16:52 IST

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. గురువారం ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నారు. డా.గుర్‌ప్రీత్‌ కౌర్‌ అనే మహిళతో చండీగఢ్‌లో పరిమిత సంఖ్యలో అతిథుల సమక్షంలో మాన్‌ వివాహం జరగనున్నట్టు సమాచారం. భగవంత్‌ మాన్‌కు ఇది రెండో వివాహం. గతంలో ఆయనకు ఇంద్రప్రీత్‌ కౌర్‌తో  వివాహం జరిగినప్పటికీ ఆరేళ్ల క్రితమే ఇద్దరూ విడిపోయారు. విడాకుల తర్వాత ఇంద్రప్రీత్‌ కౌర్‌ తన ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. అయితే, సీఎం భగవంత్‌ మాన్‌ తల్లి, సోదరి కోరికమేరకు ఆయన గురుప్రీత్‌ కౌర్‌ను వివాహం చేసుకొనేందుకు అంగీకరించినట్టు సమాచారం. కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో గురువారం మధ్యాహ్నం వీరి వివాహం జరగనుంది. అధికారికంగా ధ్రువీకరించకపోయినప్పటికీ.. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరుకానున్నారు. అలాగే, దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, పంజాబ్‌ కేబినెట్‌ మంత్రులు, మాన్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు  హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

1973 అక్టోబరు 17న పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లాలో జన్మించిన భగవంత్‌ మాన్‌.. చిన్నతనం నుంచే ఎంతో హాస్యచతురత ప్రదర్శించేవారు. కాలేజీ రోజుల్లో యూత్‌ కామెడీ ఫెస్టివల్స్‌లో పాల్గొనేవారు. ఆ తర్వాత అదే కెరీర్‌గా ఎంచుకొని రాజకీయాలు, బిజినెస్‌, క్రీడల వంటి అంశాలపై తనదైన శైలిలో జోకులు వేస్తూ అనతికాలంలో విశేష ప్రేక్షకాదరణ పొందారు. 2011లో ఆయన చేసిన ‘జుగ్ను కెహెందా హై’, ‘జుగ్ను మస్త్‌ మస్త్‌’ వంటి టెలివిజన్‌ ప్రోగ్రామ్‌లు ఎంతో పాపులర్‌ అయ్యాయి. అలా కమెడియన్‌గా ఎంతో గుర్తింపు సాధించిన భగవంత్‌ మాన్‌ 2011లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ పంజాబ్‌లో చేరి 2012 అసెంబ్లీ ఎన్నికల్లో లెహ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కలిసిరాకపోవడంతో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో సంగ్రూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 2లక్షల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ క్లీన్‌స్వీప్‌ చేయడంతో ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి పలు సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని