Agnipath: మిత్రుల మాట మాత్రమే వినడం వల్ల.. ప్రజల నుంచి ఈ తిరస్కరణ: రాహుల్

సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి.

Updated : 17 Jun 2022 16:12 IST

దిల్లీ: సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. గతంలో ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. 

అగ్నిపథ్‌... యువత తిరస్కరించింది
వ్యవసాయ చట్టాలు... రైతులు తిరస్కరించారు
నోట్ల రద్దు... ఆర్థికవేత్తలు తిరస్కరించారు
జీఎస్‌టీ... వ్యాపారవేత్తలు తిరస్కరించారు
దేశ ప్రజలకు ఏం కావాలో ప్రధానికి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయనకు తన మిత్రుల గొంతు తప్ప ఇంకేం వినలేదు’ అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. 

నిన్న చేసిన ట్వీట్‌లో ‘నో ర్యాంక్‌-నో పెన్షన్‌, రెండేళ్లపాటు ప్రత్యక్ష నియామకాలు చేపట్టకపోవడం, నాలుగేళ్ల తర్వాత భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం, సైన్యంపై ప్రభుత్వానికి గౌరవం లేదనే విషయం స్పష్టమవుతోంది’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఇటువంటి సమయంలో దేశంలో నిరుద్యోగుల గళాన్ని వినాలని.. అగ్నిపథ్‌తో ముందుకెళ్తూ వారి సహనానికి అగ్నిపరీక్ష పెట్టవద్దని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

అలాగే తాజాగా వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచడాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ‘24 గంటలు గడవకముందే భాజపా ప్రభుత్వం సైనిక నియామకాల పథకం నిబంధనలను మార్చాల్సి వచ్చింది. ఇది చూస్తుంటే ఈ అగ్నిపథ్‌ నిర్ణయాన్ని హడావుడిగా తీసుకొన్నట్లు తెలుస్తోంది. మోదీజీ దీనిని వెంటనే వెనక్కి తీసుకోండి. వైమానిక దళంలో నిలిచిపోయిన నియామక ప్రక్రియ ఫలితాలు వెల్లడించండి. వయో సడలింపుతో మునుపటిలా ఆర్మీ నియామకాలను చేపట్టండి’ అంటూ ఆమె ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని