Rahul Gandhi: మణిపుర్‌లో.. ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ షురూ

మణిపుర్‌ నుంచి రాహుల్‌ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్‌ యాత్ర’ ఆదివారం ప్రారంభమైంది. మొత్తం 110 జిల్లాల మీదుగా 67 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.

Updated : 14 Jan 2024 21:56 IST

ఇంఫాల్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆధ్వర్యంలో ‘భారత్ జోడో న్యాయ్‌ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’ ప్రారంభమైంది. మణిపుర్‌లోని తౌబాల్‌ జిల్లాలో దీనికి శ్రీకారం చుట్టారు. యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్‌ ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని పేర్కొన్నారు. అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంతవరకూ సందర్శించలేదని విమర్శించారు. ఈ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగం కాదని భావిస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు.

రాజ్యాంగ ప్రవేశికను రక్షించేందుకు రాహుల్ పోరాడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భాజపా (BJP) మతాన్ని రాజకీయాలతో కలుపుతూ.. ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. తాము లౌకికవాదం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. మణిపుర్‌ ప్రజల ఓట్లను అడిగేందుకే ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చారని, కానీ.. వారు బాధలో ఉన్నప్పుడు రాలేదని విమర్శించారు.

పదేళ్ల భాజపా అన్యాయంపైనే ఈ ‘న్యాయ్‌’ యాత్ర: కాంగ్రెస్‌

అంతకుముందు ఇంఫాల్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్ మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ‘ఖోంగ్‌జోమ్‌ యుద్ధ స్మారకం’ వద్దకు వెళ్లారు. 1891 ఆంగ్లో- మణిపుర్ యుద్ధంలో అమరులైనవారికి నివాళులర్పించారు. అనంతరం ‘న్యాయ్‌ మైదాన్‌’కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మణిపుర్‌ నుంచి ముంబయి వరకు సాగే యాత్రను ప్రారంభించారు.

‘భారత్ జోడో న్యాయ్‌ యాత్ర’ మొత్తం 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 67 రోజుల పాటు 6,713 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబయిలో ముగుస్తుంది. దీని ద్వారా సార్వత్రిక ఎన్నికల ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఎన్నికలకు దీనికి సంబంధం లేదని, ఇదో సైద్ధాంతిక యాత్ర అని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని