Updated : 15/11/2021 12:51 IST

Delhi: సంపూర్ణ లాక్‌డౌన్‌కు సిద్ధం: దిల్లీ ప్రభుత్వం

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీలో అవసరమైతే సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించడానికి సిద్ధమని అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. దిల్లీలో వాయు కాలుష్యంపై నేడు సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ జరిగింది. చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై. చంద్ర చూడ్‌, జస్టిస్‌ సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది.  ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల కేవలం 10శాతం మాత్రమే కాలుష్యం వస్తోందని కోర్టుకు వెల్లడించారు. కేంద్రం వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ప్రణాళికను న్యాయస్థానానికి అందజేసింది. దీనిలో స్టోన్‌ క్రషర్లను, కొన్ని రకాల విద్యత్తు కర్మాగారాలను నిలిపివేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను దహనం చేయడాన్ని ఆపివేయడం వంటివి ఉన్నాయి.  వీటిని అమలు చేస్తే కొంత ఫలితం ఉంటుందని సోలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు వెల్లడించారు.

మరోపక్క అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం న్యాయస్థానానికి ప్రమాణ పత్రం సమర్పించింది. దీనిలో దిల్లీతోపాటు  నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో కూడా కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉందని పేర్కొంది. లాక్‌డౌన్‌ మాత్రమే తక్షణం కొంత మేరకు ప్రభావం చూపించగలదని తెలిపింది. ‘‘స్థానిక ఉద్గారాలను అదుపు చేసేందుకు సంపూర్ణ లాక్‌డౌన్‌ వంటి నిర్ణయాలు తీసుకోవడానికి దిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతోపాటు పక్కరాష్ట్రాల పరిధిలోని ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో కూడా ఇలాంటి చర్యలే తీసుకొంటే ఫలితం మెరుగ్గా ఉంటుంది. లాక్‌డౌన్‌ కచ్చితంగా దిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించడంలో ప్రభావం చూపిస్తుంది. ఈ చర్యలు తీసుకోవడానికి మేం సిద్ధం. ఎన్‌సీఆర్‌ రీజియన్‌లో అమలు చేయాలని కేంద్రం గానీ, కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌గానీ ఆదేశించాలి’’ అని ప్రమాణ పత్రంలో పేర్కొంది.

దిల్లీలో రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు ఎన్ని ఉన్నాయని జస్టిస్‌ సూర్యకాంత్‌  దిల్లీ తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ రాహుల్‌ మెహ్రాను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందిస్తూ.. ‘‘ఇలాంటి కుంటి సాకులు చెబితే మీరు ఆర్జిస్తున్న ఆదాయం.. పాపులర్‌ స్లోగన్లపై ఎంత వెచ్చిస్తున్నారో ఆడిట్‌ చేయాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు.  

దిల్లీ, కేంద్ర ప్రభుత్వం, పంజాబ్‌, హరియాణ,ఉత్తరప్రదేశ్‌ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అవకాశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అంతలోపు కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలు రేపు భేటీ అయి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని పేర్కొంది. తదుపరి విచారణ నవంబర్‌ 17వ తేదీకి వాయిదా వేసింది. 

ఇటీవల దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సోమవారం నుంచి రాష్ట్రంలోని మొత్తం పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ అధికారులు సైతం వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. వారం రోజులపాటు ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వాలని ప్రైవేటు సంస్థలకు సూచించారు. వాహనాలు తిరగడాన్ని నియంత్రించేందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నగరంలో దుమ్మురేగకుండా అన్ని నిర్మాణ కార్యక్రమాలను సైతం నాలుగు రోజులపాటు నిలిపివేయాలని ఆదేశించారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని