Bike taxi: బైక్‌ ట్యాక్సీల చెల్లుబాటుపై కేంద్రం క్లారిటీ

Bike taxi: నగర జీవనంలో భాగమైపోయిన బైక్‌ ట్యాక్సీల విషయంలో కేంద్రం స్పష్టతనిచ్చింది. ట్యాక్సీలుగా వినియోగించుకునే వెసులుబాటును మోటారు వాహనాల చట్టం కల్పిస్తోందని పేర్కొంది.

Published : 16 Feb 2024 02:19 IST

Bike taxi | దిల్లీ: నగర జీవనంలో బైక్‌ ట్యాక్సీలూ (Bike taxi) భాగమైపోయాయి. ఉరుకుల పరుగుల జీవితంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లేందుకు ఈ ట్యాక్సీలు అనువుగా మారాయి. అటు ప్రయాణికులకే కాదు.. వీటివల్ల కొందరికి ఉపాధి అవకాశాలూ లభిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బైక్‌ ట్యాక్సీలపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఈనేపథ్యంలో వీటి చెల్లుబాటుపై కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ స్పష్టతనిచ్చింది.

మోటార్ వాహనాల చట్టం, 1988 ప్రకారం.. మోటారు సైకిల్స్‌ అనేవి కాంట్రాక్ట్‌ క్యారేజీ పర్మిట్‌ కలిగిఉంటాయని పేర్కొంది. ఈ ఒప్పందం అద్దె ప్రాతిపదికన ప్రయాణికులను ఎక్కించుకునే వెసులుబాటును కల్పిస్తోందని పేర్కొంది.     ఈమేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అడ్వైజరీని జారీ చేసింది. ట్రాన్స్‌పోర్ట్‌ వాహనంగా లేదా కాంట్రాక్ట్‌ క్యారేజీ కింద మోటార్‌ సైకిళ్లను నడిపేందుకు వీల్లేదంటూ కొన్ని రాష్ట్రాలు/ యూటీలు పర్మిట్స్‌కు నిరాకరిస్తున్నట్లు కేంద్రం  దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ అడ్వైజరీని జారీ చేసింది.

‘‘మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 2(28) ప్రకారం.. నాలుగు కంటే తక్కువ చక్రాలు ఉండి, 25 సీసీ+ ఇంజిన్‌ సామర్థ్యం కలిగిఉన్న వాహనాలను మోటార్‌ సైకిల్‌ అనే అంటారు’ అని కేంద్రం తన అడ్వైజరీలో స్పష్టంచేసింది. కాంట్రాక్ట్‌ క్యారేజీ ఒప్పందం అనేది.. నిర్ణీత సమయం లేదా నిర్ణీత కిలోమీటర్లకు గానూ వాహనాన్ని అద్దెకు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తోందని కేంద్రం స్పష్టంచేసింది. దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర ఇప్పటికే బైక్‌ ట్యాక్సీల వినియోగంపై ఆంక్షలు విధించాయి. దీంతో క్యాబ్‌ అగ్రిగేటర్లు న్యాయపోరాటం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రం దీనిపై స్పష్టతనివ్వడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని