DMK Raja: ‘భారత్‌ ఎప్పుడూ ఒక దేశం కాదు’ : డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై దుమారం

భారత్‌ ఎప్పుడూ ఒక దేశం కాదని.. ఉప ఖండమంటూ డీఎంకే ఎంపీ ఏ రాజా (DMK MP A Raja) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం  రేగింది.

Updated : 05 Mar 2024 18:44 IST

చెన్నై: భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన భారత్‌ ఎప్పుడూ ఒక దేశం కాదని.. ఉపఖండమంటూ డీఎంకే ఎంపీ ఏ రాజా (DMK MP A Raja) చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. డీఎంకే ఇటీవల ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో రాజా చేసిన ఈ వ్యాఖ్యలపై భాజపా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాముడి గురించీ ఆయన తప్పుగా మాట్లాడారని.. వెంటనే అరెస్టు చేయాలని డిమాండు చేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌.. రాజా వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని, వాటిని ఖండిస్తున్నామని ప్రకటించింది.

‘భారత్‌ ఒక దేశం కాదు. ఎప్పుడూ ఒక దేశంగా లేదు. ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి.. వంటి లక్షణాలు ఉంటే ఒకే దేశం అంటారు. కానీ, భారత్‌ అలా కాదు. భిన్న భాషలు, విభిన్న సంస్కృతులున్న రాష్ట్రాలు కలిసి దేశంగా ఏర్పడ్డాయి. అందుకే ఇది దేశం కాదు.. ఉపఖండం. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది’ అని ఏ రాజా వ్యాఖ్యానించారు.

మీరొక మంత్రి.. ఆ మాత్రం తెలియదా?: ఉదయనిధి ‘సనాతన’ వ్యాఖ్యలపై సుప్రీం

ఈ వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా తప్పుపట్టింది. డీఎంకే నుంచి ఇటువంటి విద్వేష ప్రసంగాలు వస్తూనే ఉన్నాయని మండిపడింది. సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యల వివాదం ముగియకముందే మరో నేత అదేతరహాలో మాట్లాడటం శోచనీయమని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్‌తో సహా ఇండియా కూటమి పక్షాలు మౌనంగా ఎందుకు ఉన్నాయని పలువురు భాజపా నేతలు ప్రశ్నించారు.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ స్పందించింది. రాజా చేసిన వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ సమాధానమిచ్చారు. వాటితో వందశాతం ఏకీభవించడం లేదని, పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని