West Bengal: సాధువులపై మూకదాడి.. బెంగాల్‌లో ఉద్రిక్తత

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో కొందరు సాధువులపై మూకదాడి జరిగింది. ఈ ఘటనతో అధికార టీఎంసీపై భాజపా తీవ్రంగా మండిపడింది.

Published : 13 Jan 2024 11:20 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో మరోసారి ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సాధువుల (Sadhus)పై పురులియా జిల్లాలో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

యూపీకి చెందిన ముగ్గురు సాధువులు మకర సంక్రాంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌ మేళాకు బయల్దేరారు. మార్గమధ్యంలో పురులియా జిల్లాలో వాహనం ఆపి ఇద్దరు అమ్మాయిలను దారి అడిగారు. వారిని చూడగానే అమ్మాయిలు భయపడుతూ పారిపోయారు. ఇది గమనించి స్థానికులు వారిని కిడ్నాపర్లుగా పొరబడి దాడి చేశారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. సాధువులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. వారు కిడ్నాపర్లు కాదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. దాడికి పాల్పడిన 12 మందిని అరెస్టు చేశారు.

లాడ్జిలో దిగిన జంటపై దాడి.. యువతిపై సామూహిక అత్యాచారం

ఈ ఘటన కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై భాజపా (BJP) స్పందిస్తూ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ‘‘గంగాసాగర్‌కు వెళ్తున్న సాధువులను దారుణంగా కొట్టారు. అధికార టీఎంసీ పార్టీ మద్దతుతో కొందరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనంగా ఉండటం సిగ్గుచేటు’’ అని భాజపా దుయ్యబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని