Supreme Court: ‘మణిపుర్‌ పరిస్థితులతో పోల్చొద్దు..’ సందేశ్‌ఖాలీ కేసుపై సుప్రీంకోర్టు

‘సందేశ్‌ఖాలీ’ కేసులో సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో విచారణ చేయించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

Published : 19 Feb 2024 17:18 IST

దిల్లీ: పశ్చిమబెంగాల్‌ను కుదిపేస్తోన్న ‘సందేశ్‌ఖాలీ’ కేసులో కోర్టు పర్యవేక్షణలో ‘సీబీఐ’ లేదా ‘ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)’తో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. ఈ ఘటనను మణిపుర్‌ పరిస్థితులతో పోల్చొద్దని పిటిషన్‌దారుకు సూచించింది. జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఆగస్టిన్‌ జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం పిల్‌ను పరిశీలించింది. ఇప్పటికే ఈ కేసును (Sandeshkhali Case) కలకత్తా హైకోర్టు సుమోటోగా తీసుకున్న విషయాన్ని గుర్తుచేసింది. ఈ కేసును ‘సీబీఐ’కి బదిలీ చేసే అంశాన్ని హైకోర్టు పరిశీలించవచ్చని పేర్కొంది.

సందేశ్‌ఖాలీ కేసు.. పార్లమెంటరీ కమిటీ దర్యాప్తుపై సుప్రీం స్టే

‘‘పరిస్థితులను సరిగ్గా అంచనా వేసేందుకు స్థానిక హైకోర్టు ఉత్తమమైన వేదిక. రెండుచోట్లా విచారణలు అనవసరం’’ అని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం.. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు అనుమతి మంజూరు చేసింది. అంతకుముందు ఈ కేసులో పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపైనా సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. దీనిపై లోక్‌సభ సెక్రటేరియట్‌, కేంద్ర హోంశాఖకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మహిళలపై రాజకీయ నాయకులు, గూండాలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సందేశ్‌ఖాలీలో గత కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని