Farmers Protest: భాజపా నేతల ఇళ్ల ముట్టడికి రైతు సంఘాల నిర్ణయం.. నాలుగో విడత చర్చలు షురూ!

డిమాండ్ల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పంజాబ్‌లోని భాజపా నాయకుల ఇళ్లను ముట్టడించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.

Published : 18 Feb 2024 22:33 IST

లూథియానా: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘దిల్లీ చలో’ (Farmers Protest) చేపట్టిన రైతులకు మద్దతుగా సంయుక్త కిసాన్‌ మోర్చా (SKM)  మంగళవారం నుంచి గురువారం వరకు పంజాబ్‌లోని భాజపా నాయకుల ఇళ్లను ముట్టడించనున్నట్లు ప్రకటించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌కేఎమ్‌ నేతలు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన నాలుగు రాష్ట్రాల్లో ధర్నాలు చేయనున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ (BKU) నేత రాకేశ్‌ టికైత్‌ ఇప్పటికే ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో ధర్నాలు జరుగుతాయని వెల్లడించారు. దాంతోపాటు ఈ నెల ఆఖరి వారంలో దిల్లీకి ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టాలని సిసౌలీ పంచాయత్‌లో నిర్ణయించినట్లు తెలిపారు.

పంటలకు కనీస మద్దతు ధర (MSP), స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలు, గతంలో చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు సాయం అందించడం సహా ఇతర డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ గత వారం రైతు సంఘాలు ‘దిల్లీ చలో’కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ట్రాక్టర్లు, ట్రాలీతో ర్యాలీగా బయలుదేరిన రైతులను శంభు సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. దిల్లీ వైపు వెళ్లకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, కాంక్రీట్‌ దిమ్మెలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించేందుకు ప్రయత్నించిన వారిపై బాష్ప వాయుగోళాలను ప్రయోగించారు. దీంతో కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించాలని, లేదంటే శాంతియుతంగా దిల్లీ వరకు ర్యాలీ చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ రైతులు ఐదు రోజులుగా సరిహద్దుల్లోనే ఉండిపోయారు.

కాంగ్రెస్‌కు ఓటేస్తే పూడ్చలేని నష్టం.. మూడోసారి గెలుపుపై అనుమానం అక్కర్లేదు: ప్రధాని మోదీ

నాలుగో దఫా చర్చలు ప్రారంభం

మరోవైపు, కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, పీయూష్‌ గోయల్‌, నిత్యానంద్‌ రాయ్‌ రైతు సంఘాల నేతలతో ఇప్పటికే మూడు సార్లు (8, 12, 15 తేదీల్లో) చర్చలు జరిపారు. అవి అసంపూర్ణంగా ముగియడంతో ఆదివారం మరో దఫా చర్చలు జరిపేందుకు చండీగఢ్‌ చేరుకొని చర్చిస్తున్నారు. ఎంఎస్‌పీ అమలుకు కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెబుతోంది. రైతులు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ డిమాండ్లను అంగీకరించాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని