Solar Storm: భూమిని తాకనున్న సౌర తుపాను.. జీపీఎస్‌, మొబైల్‌ సేవలకు అంతరాయం..?

భూమివైపు వేగంగా దూసుకొస్తోన్న ఓ సౌర తుపాను జులై 20న భూక్షేత్రాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు అంతరిక్ష పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Published : 20 Jul 2022 02:02 IST

అంచనా వేస్తున్న ఖగోళ శాస్త్రవేత్తలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్షంలో సంభవించే సౌర తుపానులు (Solar Storm) అప్పుడప్పుడు భూమిని తాకే సందర్భాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ సౌర తుపాను భూమివైపు వేగంగా దూసుకొస్తోంది. జులై 20న భూమిని తాకే అవకాశాలున్నట్లు అంతరిక్ష (Space) పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇటువంటి సౌర తుపాన్లు భూమిని (Earth) తాకడం సాధారణమే అయినా.. ఈసారి మాత్రం అధిక ప్రభావం చూపించే ఎం రకం (M-Class) జ్వాలలు వీస్తున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో జీపీఎస్‌ (GPS)తోపాటు రేడియో, మొబైల్‌ సిగ్నళ్లకు అంతరాయం కలిగే ప్రమాదం కూడా ఉండవచ్చని చెబుతున్నారు.

సూర్యుడి ఉపరితలంలో ఓ శక్తిమంతమైన ఓ సౌర జ్వాల (Solar Flare) జులై 15న మొదలైనట్లు అంతరిక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. గంటకు లక్షల కి.మీ వేగంతో ప్రయాణిస్తోన్న ఈ సౌరజ్వాల జులై 20, 21 తేదీల్లో భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకవచ్చని చెబుతున్నారు. ఈ సౌర తుపాను కారణంగా ఉత్తర/దక్షిణ ధ్రువాల్లో ప్రకాశమంతమైన ఖగోళ కాంతి కనిపించడమే కాకుండా భూమి బాహ్య వాతావరణం కూడా వేడెక్కే అవకాశం ఉంటుందని అంచనా. దీని ప్రభావంతో భూ కక్ష్యలో ఉండే ఉపగ్రహాలపై ప్రభావం పడటంతోపాటు జీపీఎస్‌, మొబైల్‌ సిగ్నళ్లు, శాటిలైట్‌ టీవీ సేవల్లో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ సౌర తుపానును అటు నాసా (NASA) శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు.

ఏమిటీ ఈ సౌర తుపాన్లు..?

సూర్యుడి ఉపరితలంలో బలమైన విద్యుదయస్కాంత కణాల (Photons) నుంచి వెలువడే రేడియేషన్‌ విస్ఫోటం చెందుతుంది. అత్యంత శక్తిమంతమైన ఈ పేలుళ్లనే సూర్య జ్వాలలుగా పేర్కొంటారు. వీటి ప్రభావం కొన్ని గంటలపాటు ఉంటుంది. పేలుడు శక్తిని బట్టి ఈ మంటలను ఏ, బీ, సీ, ఎం, ఎక్స్‌ తరగతులుగా వర్గీకరిస్తారు. వీటిలో ఎక్స్‌ తరగతివి అత్యంత శక్తిమంతమైనవి. గంటకు లక్షల కి.మీ వేగంతో ప్రయాణించే ఈ జ్వాలలనే సౌర తుపాన్లుగా పేర్కొంటారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని