SpiceJet: ‘ఆటోపైలట్’లో లోపం.. మరో స్పైస్‌జెట్‌ విమానం వెనక్కి..!

దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను వరుస వైఫల్యాలు వేధిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం బయటపడింది.

Published : 01 Sep 2022 12:07 IST

దిల్లీ: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను వరుస వైఫల్యాలు వేధిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం బయటపడింది. దిల్లీ నుంచి మహారాష్ట్ర బయల్దేరిన ఓ విమానంలో ‘ఆటోపైలట్‌’ వ్యవస్థలో సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానం అర్ధాంతరంగా వెనుదిరిగింది.

స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానం గురువారం ఉదయం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌ బయల్దేరింది. అయితే, టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ‘ఆటోపైలట్‌’ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని సిబ్బంది గుర్తించారు. దీంతో విమానం వెంటనే వెనుదిరిగింది. దిల్లీ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని, ప్రయాణికులను క్షేమంగా దించేసినట్లు స్పైస్‌జెట్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు.

అధిక ఇంధన ధరలు, రూపాయి క్షీణత ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌ను ఇటీవల వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఆ మధ్య ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తాయి. జూన్‌ 19 నుంచి జులై 5 మధ్య ఎనిమిది ఘటనలు చోటుచేసుకొన్నాయి. దీంతో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) చర్యలకు ఉపక్రమించింది. కంపెనీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంతో పాటు ఎనిమిది వారాల పాటు 50శాతం సామర్థ్యంతోనే విమానాలు నడపాలని జులై 27న ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని