Updated : 18 Feb 2020 17:15 IST

కసబ్‌ చేతికున్న ‘ఎర్రదారం’ వెనుక కథేంటీ?

ఆసక్తికర విషయాలు వెల్లడించిన ముంబయి మాజీ కమిషనర్‌

ముంబయి: మహ్మద్‌ అజ్మల్‌ అమీర్‌ కసబ్‌.. ఈ పేరు వినగానే ముంబయి భీకర పేలుళ్ల దృశ్యాలు కళ్లముందు కన్పిస్తాయి. 12ఏళ్ల క్రితం దేశ ఆర్థిక రాజధానిలో మారణహోమం సృష్టించి ఎంతో మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కరుడుగట్టిన ఉగ్రవాది అతడు. పక్కా పాకిస్థానీ అయిన కసబ్‌ను  హిందూ ఉగ్రవాదిగా చూపించేందుకు ఒకదశలో ప్రయత్నాలు జరిగాయట. కసబ్‌ చేతికున్న ‘ఎర్రదారాన్ని’ ఇందుకు కారణంగా చూపించారట. ఈ మేరకు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ మరియా.. ‘లెట్‌ మీ సే ఇట్‌ నౌ’ పేరుతో రాసిన తన పుస్తకంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

ముంబయి పేలుళ్ల తర్వాత కసబ్‌ ఫొటో ఒకటి బయటకొచ్చింది. అందులో భుజాన బ్యాగ్‌ వేసుకుని తుపాకీ పట్టుకుని వెళ్తున్న కసబ్‌ తన కుడిచేతికి ఎర్రదారం కట్టుకుని కన్పిస్తాడు. ఈ ఫొటో ద్వారా ముంబయి పేలుళ్లను ‘హిందూ ఉగ్రవాదం’ వల్ల జరిగిన ఘటనగా చూపించే ప్రయత్నం చేసింది లష్కరే తోయిబా సంస్థ. అంతేగాక కసబ్‌ గుర్తింపు కార్డులోనూ అతడి పేరు సమీర్‌ దినేశ్‌ చౌధరీ అని, బెంగళూరు వాసి అని ఉంది. దాడి చేసింది హిందువులే అన్నట్లు చూపించే ప్రయత్నమది.  

‘ఈ ఎర్రదారం చూపించి దాడిని హిందూ ఉగ్రవాద ఘటనగా చూపించాలని లష్కరే భావించింది. అలా చేస్తే మీడియా కూడా దానిపై దృష్టి పెడుతుందని అనుకుంది. పెద్ద పెద్ద టీవీ జర్నలిస్టులు సైతం సమీర్‌ దినేశ్‌ చౌధరీ కోసం బెంగళూరు వెళ్తారని ఊహించింది. అయితే అవేమీ పనిచేయలేదు. అజ్మల్‌ కసబ్‌ పాకిస్థాన్‌ వాసి అని తెలిసిపోయింది’ అని మరియా తన పుస్తకంలో పేర్కొన్నారు. 

 

ముంబయి పేలుళ్ల తర్వాత కసబ్‌ సజీవంగా దొరికాడు. అయితే అతడి ద్వారా పోలీసులకు నిజాలు తెలుస్తాయని భావించిన పాక్‌ ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా సాక్ష్యాలను లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్లు మరియా వెల్లడించారు. ఇందులో భాగంగానే కసబ్‌ను చంపే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. ఆ పనిని దావూద్‌ ఇబ్రహిం గ్యాంగ్‌కు అప్పగించినట్లు చెప్పారు. అయితే లష్కరే ప్రయత్నాలేవీ ఫలించలేదు. 

పోలీస్‌ కస్టడీలో రెండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం 2010లో కసబ్‌ను దోషిగా తేలుస్తూ ముంబయి ట్రయల్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ అతడు బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. అతడి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో 2012 నవంబరు 21 ఉదయం 7.30 గంటలకు పుణెలోని యరవాడ జైలులో కసబ్‌ను ఉరితీశారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని