StrayDogs: వీధి కుక్కల దాడిలో అన్నదమ్ములు బలైపోయారు!

రెండు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు వీధి కుక్కలకు (Stray Dogs) బలైన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. నైరుతి దిల్లీలోని (Delhi) వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో నివాసముండే ఓ నిరుపేద కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

Published : 12 Mar 2023 21:46 IST

దిల్లీ: దేశంలో చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పౌరులపై శునకాల దాడులు పెరుగుతోన్నట్లు నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడటం కలకలం రేపింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వేర్వేరు ఘటనల్లో ఇవి చోటుచేసుకోవడం ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. ఒక కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలోనూ రెండోది చోటుచేసుకోవడం గమనార్హం.

నైరుతి దిల్లీలోని వసంత్‌ కుంజ్‌లో ఉన్న రుచి విహార్‌ ప్రాంతమది. అటవీ స్థలంలో అక్కడ కొందరు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. అందులో నివాసముండే ఆనంద్‌ (7) అనే బాలుడు శుక్రవారం మధ్యాహ్నం ఆడుకునేందుకు వెళ్లి తిరిగి రాకపోవడంతో బాలుడి తల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. బాలుడి తల్లితో కలిసి చిన్నారి కోసం గాలించారు. రెండుగంటల తర్వాత సమీపంలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై గాయాలున్నట్లు గుర్తించిన పోలీసులు.. శవపరీక్షకు పంపించగా జంతువుల దాడిలో చనిపోయినట్లు ప్రాథమికంగా తేలింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్‌ నిపుణులు, క్రైం బృందాలు.. ఆ ప్రాంతంలో ఇటీవల వీధి కుక్కల దాడులు పెరిగాయని.. ఆ క్రమంలోనే ఆనంద్‌పైనా దాడి చేసి చంపినట్లు నిర్ధారణకు వచ్చారు.

ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ఆనంద్‌ సోదరుడు ఆదిత్య (5), మూత్రవిసర్జన కోసం తన స్నేహితుడితో కలిసి గుడిసె నుంచి కొంతదూరం వెళ్లారు. తిరిగి వచ్చేందుకు ప్రయత్నించే సమయంలోనే అతడిని కొన్ని కుక్కలు చుట్టుముట్టాయి. అది చూసి భయపడిన తోటి స్నేహితుడు పరుగెత్తుకు వచ్చి ఆదిత్య ఇంట్లో తెలియజేశాడు. అప్పటికే అవి బాలుడిపై దాడి చేయడంతో ఆదిత్యకూ తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆనంద్‌ కేసు విచారణ జరిపేందుకు అక్కడకు చేరుకున్న వసంత్‌ గంజ్‌ పోలీసులు.. ఆదిత్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, ఈ బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు వీధి కుక్కలకు బలికావడం ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు